7 March, 2026 | 5:58 PM

పిల్లలపై వివక్ష

06-03-2026 02:36 AM

బాబు అయితే ప్రైవేట్ బడి..పాప అయితే గవర్న మెంట్ స్కూళ్లో!

ఆర్థిక సమస్యలు, కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో మారుతున్న తల్లిదండ్రుల ఆలోచనలు

రెండో తరగతి వాచకము చదవగలిగే 3వ తరగతి విద్యార్థులు 6.3 శాతమే..

37 శాతం పాఠశాలల్లో లేని ఇంటర్‌నెట్ సౌకర్యం

హైదరాబాద్, మార్చి 5 (విజయక్రాంతి): తెలంగాణ విద్యాకమిషన్ నివేదికలోని గణాంకాలను పరిశీలిస్తే ఆశ్చర్యమేయక మానదు. అబ్బాయి, అమ్మాయిల చదువు విషయంలో తల్లిదండ్రుల ఆలోచనలు భిన్నంగా కనిపిస్తున్నాయి. కమిషన్ నివేదిక ప్రకారం చూస్తే ఎక్కువ మంది తల్లిదండ్రులు అబ్బాయిలను ప్రైవేట్ స్కూళ్లో చదివిస్తుంటే, అమ్మాయిలను మాత్రం ప్రభుత్వ స్కూళ్లలో వేస్తున్నారు.

అయితే, దీనికి అనేక రకాల కారణాలు ఉండొచ్చని తెలుస్తోంది. తమ కుంటుంబ ఆర్థిక పరిస్థితి, సమస్యలు, కుటుంబ నేపథ్యం, అవసరాల మేరకు ఈ రకంగా చదివించే అవకాశముండచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓ కుంటుంబంలో ఒక అబ్బాయి, అమ్మాయి ఉంటే వారిద్దరినీ ఒకే ప్రైవేట్ స్కూళ్లో చదివించే ఆర్థిక స్థోమత లేకపోవడం లాంటి కారణాలతో అబ్బాయిని ప్రైవేట్‌లో, అమ్మాయిని ప్రభుత్వ స్కూళ్లో చదివించే అవకాశముంది. రాష్టంలో ప్రభుత్వ, ప్రైవేట్ అన్ని రకాల పాఠశాలలు కలిపి మొత్తం 41,714 ఉండగా, వీటిలో ప్రైవేట్ స్కూళ్లు 13,244 ఉన్నాయి.

అయితే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న మొత్తం 26,81,580 మంది విద్యార్థుల్లో 48 శాతం (12,87,158) మంది అబ్బాయిలు చదువుతుండగా, అమ్మాయిలు మాత్రం 52 శాతం (13,94,422) మంది చదువుతున్నారు. అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్లలో మొత్తం 47,51,692 మంది చదువుతుండగా, అందులో అబ్బాయిలు 54 శాతం (26,73,914) మంది చదువుతుంటే, అమ్మాయిలు మాత్రం 46 శాతం (22,77,778) మంది చదువుతుండడం గమనార్హం. 

37శాతం బడుల్లో నో ఇంటర్ నెట్ 

37 శాతం బడులు ఇంటర్నెట్‌కు దూరంగా ఉన్నాయి. కేంద్ర విద్యాశాఖ యూడైస్ ప్లస్ 2024 వివరాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో కేవలం 63.3 శాతం స్కూళ్లలోనే ఇంటర్నెట్ సౌకర్యం ఉంది. ఇంటర్‌నెట్ సౌకర్యం అందుబాటులో తెలంగాణ రాష్ట్రం 23వ స్థానంలో ఉంది. తెలంగాణ కంటే చిన్న రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు మనకంటే మెరుగైనా స్థానాల్లో ఉన్నాయి. ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, లక్ష్యద్వీప్‌తోపాటు మరికొన్ని రాష్ట్రాల్లో వందశాతం బడుల్లో పూర్తి స్థాయి ఇంటర్నెట్ సౌకర్యం ఉంది. బీహార్ లాంటి రాష్ట్రంలోనూ 84.8 శాతం ఉండగా, పొరుగున ఉన్న ఏపీలో 99శాతం బడుల్లో ఇంటర్‌నెట్ సౌకర్యం ఉంది. 

ఒకటో తరగతిలో 26శాతమే ఎన్‌రోల్‌మెంట్ 

ప్రభుత్వ బడుల్లో ఒకటో తరగతిలో విద్యార్థుల నమోదు 26 శాతం మాత్రమే ఉంది. ఇక రెండో తరగతి వాచకము చదవగలిగే మూడో తరగతి విద్యార్థులు కేవలం 6.3 శాతం ఉండడం గమనార్హం. అంటే వారికి కనీసం చదవడము కూడా రానిపరిస్థితి. జీరో ఎన్‌రోల్‌మెంట్ ఉన్న బడులు 1920 ఉన్నాయి. ఈ విభాగంలో తెలంగాణ దేశంలోనే రెండవ స్థానంలో కలిగి ఉంది.

36శాతం ప్రభుత్వ ప్రాథమిక బడుల్లో ఒక టీచర్ మాత్రమే ఉండగా, 82 శాతం ప్రభుత్వ ప్రాథమిక బడుల్లో మల్టీ గ్రేడ్ బోధన ఉంది. నాణ్యమైన పాఠశాల విద్యలో మన తెలంగాణ ర్యాంక్ 26గా ఉంది. రాష్ట్రంలో 3 వయస్సు గల విద్యార్థుల సంఖ్య 80 లక్షల మంది ఉన్నారు.