6 April, 2026 | 3:33 AM

ఘనంగా డిప్యూటీ సీఎం భట్టి కుమారుడి రిసెప్షన్ వేడుక

06-04-2026 01:42 AM

ఖమ్మం, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క - నందిని దంపతుల కుమారుడు సూర్య విక్రమాదిత్య, సాక్షిల వివాహ రిసెప్షన్ వేడుక ఆదివారం అశేష జనవాహిని మధ్య కనుల పండుగగా జరిగింది. నగరంలోని గ్రీన్ హిల్స్, వైయస్సార్ కాలనీ రోడ్ వేదికగా ఉదయం 10 గంటల నుండే ప్రారంభమైన ఈ శుభకార్యం సాయంత్రం వరకు అత్యంత వైభవంగా కొనసాగింది. కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలిరావడంతో ఖమ్మం నగరం జనసంద్రంగా మారింది.

ఈ రిసెప్షన్ వేడుకకు ఉమ్మడి ఖమ్మం జిల్లా శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, కలెక్టర్లు, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నత స్థాయి అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు హాజరై నూతన వధూవరులను దీవించారు. వీరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కీలక రాజకీయ నాయకులు, ప్రముఖులు మరియు వివిధ ప్రజాసంఘాల నాయకులు విచ్చేసి భట్టి విక్రమార్క కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఒకవైపు రాజకీయ గంభీరం, మరోవైపు అధికారుల సమక్షంతో వేదిక ప్రాంగణం కళకళలాడింది. 

సుమారు లక్ష మందికి పైగా జనం ఈ వేడుకకు హాజరయ్యారు. ముఖ్యంగా మధిర నియోజకవర్గంలోని ప్రతి పల్లె నుండి వచ్చిన అభిమానుల కోసం భారీ ఎత్తున భోజన వసతులు కల్పించారు. ట్రాఫిక్ నియంత్రణకు పోలీసు యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టగా, వేలాది వాహనాల పార్కింగ్ కోసం భారీ స్థలాలను కేటాయించారు. ఇంతటి భారీ జనసందోహం ఉన్నప్పటికీ, ఎక్కడా అసౌకర్యం కలగకుండా వాలంటీర్లు, కార్యకర్తలు పర్యవేక్షించడం విశేషం. ‘మా కుటుంబ వేడుకకు విచ్చేసి నూతన వధూవరులను దీవించి, విందును స్వీకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు‘ అని భట్టి విక్రమార్క - నందిని దంపతులు తెలిపారు.