మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం
గర్భిణి కి సకాలంలో ఏ నెగిటివ్ రక్తం అందజేత
ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు
కామారెడ్డి,(విజయక్రాంతి): మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం అని ఐవిఎఫ్ సేవ దళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు అన్నారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో రక్తహీనతతో బాధపడుతున్న గౌతమి (28) గర్భిణీకి ఏ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తాన్ని ఎల్లారెడ్డికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు గోష్కే నాగరాజు మానవతా దృక్పథంతో స్పందించి రక్తదానం చేయడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా యువత రక్తదానానికి ముందుకు రావాలని ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 12 కోట్ల యూనిట్ల రక్తం రక్తదాతలు అందజేస్తున్నారు. ప్రతిరోజు 3 లక్షల 20వేల యూనిట్ల రక్తం అవసరం ఉన్నదని సకాలంలో రక్తం దొరకకపోవడంతో ఎంతోమంది ప్రాణాలను కోల్పోతున్నారని అన్నారు,తల సేమియా బాధిత చిన్నారులకు 15 రోజులకు వారి జీవితాంతం రక్తం అవసరమవుతుందని అన్నారు.
వైద్యరంగం ఎంతగానో అభివృద్ధి చెందినప్పటికీ రక్తానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవని మానవతా దృక్పథంతో ముందుకు వచ్చే రక్త దాతలు లేకపోతే ఎంతోమంది ప్రాణాలను కోల్పోవడం జరుగుతుందనే విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తు ఎరగాలని అన్నారు. రెడ్ క్రాస్, కామారెడ్డి రక్తదాతల సమూహం,ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్)ల సంయుక్త ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో మరిన్ని రక్తదాన శిబిరాలను నిర్వహిస్తామని అన్నారు.రక్తదాత గోష్కే నాగరాజుకు అభినందనలు తెలిపారు.






