మహిళల పట్ల చులకనగా మాట్లాడటం సరికాదు.. మీ గురించి రాష్ట్రమంతా తెలుసు
మీఇంటి ఆడబిడ్డపై ఎలాంటి గౌరవం ఉందో రాష్ట్రమంతా చూస్తోంది
కేటీఆర్ దారి తప్పుతున్నారు..
హైదరాబాద్: ప్రభుత్వ హామీలు నెరవేర్చట్లేదని ఆరోపించడం సరికాదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka ) పేర్కొన్నారు. ఒక్కో కుటుంబానికి ఎంత లబ్ది చేకూరిందనేది లెక్కల్లో చెబుతామన్నారు. అర్హులైన 53 లక్షల మందికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 1.15 కోట్ల కుటుంబాల్లో 1.06 కోట్ల మందికి సన్న బియ్యం ఇస్తున్నామని పేర్కొన్నారు. గతంలో పెండింగ్ పెట్టిన వడ్డీ లేని రుణాలను తాము క్లియర్ చేస్తున్నామని గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా భట్టి విక్రమార్క వివరించారు.
ఐదేళ్లలో రూ. లక్ష కోట్ల వడ్డీ లేని రుణాల లక్ష్యాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. కేటీఆర్ దారి తప్పారని అనిపిస్తోందని విక్రమార్క సూచించారు. మహిళల అభివృద్ధి, సంక్షేమం గురించి గత ప్రభుత్వానికి ఆలోచన లేదని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో మహిళా మంత్రులను తీసుకోలేదని విమర్శించారు. రాష్ట్రంలో మహిళలను మహాలక్ష్ముల్లా గౌరవిస్తున్నామని భట్టి విక్రమార్క వివరించారు.
మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకుంటే కుటుంబ బాగుపడుతోందన్నారు. ఏడాదికి 20 వేల కోట్ల వడ్డీ లేని రుణాలను మహిళలకు ఇప్పించే చర్యలు చేపట్టామని తెలిపారు. మహిళలకు ఇప్పటివరకు రూ. 57 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇప్పించామని స్పష్టం చేశారు. మహిళల పట్ల చులకనగా మాట్లాడటం సరికాదని భట్టి విక్రమార్క హెచ్చరించారు. మీ ఇంటి ఆడబిడ్డపై ఎలాంటి గౌరవం ఉందో రాష్ట్రమంతా చూస్తోందని ఆరోపించారు. మీ వ్యాఖ్యలు కోట్లాది మహిళల ఆత్మగౌరవాన్ని కించపరుస్తోందని వెల్లడించారు.




