అడుగంటిన నీరు..
- లోతులోకి భూగర్భజలం.. నెర్రెలు బారుతున్న పొలం..
పొలం ఎండిపోయి గోస పడుతున్న రైతన్న
ట్యాంకర్ల ద్వారా పంటను కాపాడేందుకు ఆరాటం
కిరాయి చెల్లిస్తూ మరింత నష్టపోతున్న రైతులు
ఉదయ సముద్రం నీటిని అందించి ఆదుకోవాలని వేడుకోలు
చిట్యాల, మార్చి 18 : వేసవికాలం ప్రారంభ దశలోనే నీటి ఎద్దడి ఏర్పడి బోరు బావులలోనినీరు అడుగంటడం వలన పంట పొలాలకు సరిపడా నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉష్ణోగ్రతలు ఇంకా పూర్తిస్థాయిలో పెరగడానికి ముందే భూగర్భ జలాలు అడుగంటి పోవడం వలన రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
వరి పంట చేతికొచ్చే సమయానికి బోరుబావులలో నీరు అడుగంటి పొలాలకు సరిపడా నీరు అందక పంట పొలాలు వాడు పడుతున్నాయి. ఎలాగైనా పంటను కాపాడుకోవాలన్న తాపత్రయంతో రైతులు ట్రాక్టర్ ట్యాంకర్ల ద్వారా నీటిని పంట పొలాలకు తరలిస్తూ వరిపైరును కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.
ట్యాంకర్ల ద్వారా పొలాలకు నీటి సరఫరా..
చేతికి వచ్చిన వరి పంట కండ్ల ముందే వాడు పడుతుండడం చూసిన రైతులు ఆవేదనకు గురవుతున్నారు. పంటపై పెట్టుబడి పెట్టి బోర్ ఎండిపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో రైతులు ట్రాక్టర్ ట్యాంకర్ల ద్వారా పంట పొలాలకు నీటిని అందిస్తున్నారు. కొంతమంది రైతులు పంట పొలాలకు నీటిని ఇతర రైతుల బావుల నుండి నీటిని పైపుల ద్వారా పొలాలకి తరలిస్తున్నారు. ట్రాక్టర్ ట్యాంకర్ కిరాయి 600 నుండి 800 వరకు, నీటిని ట్యాంకర్ లో నింపిన బోరు యజమానికి 200 రూపాయలు రైతులు చెల్లిస్తున్నారు.
అదనపు భారంతో నష్టపోతున్న రైతులు..
పొలానికి నీరు అందక పంట వాడు పడుతుండడం చూసి రైతులు ఒక్కో ట్యాంకర్ కు ఎనిమిది వందల నుండి వెయ్యి రూపాయల వరకు ట్యాంకర్లకు కిరాయి చెల్లిస్తూ పంటను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు పెరిగిన విత్తనాలు,ఎరువుల ధరలు, పంటపై పెట్టుబడి పెట్టి, ఎండిపోతే ఎక్కడ అప్పుల పాలు అవుతామోనని ఆవేదనతో పెట్టుబడులకు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి ట్యాంకర్లకు నగదును చెల్లిస్తూ ఆర్థికంగా రైతులు నష్టపోతున్నారు.
రైతులు ఆర్థికంగా నష్టపోకుండా గ్రామాలలోని చెరువులకు కుంటలకు కాలువల ద్వారా నీటిని అందించి వాటిని నింపడం వల్ల భూగర్భ జలం పెరుగుతుందని, తక్షణమే ప్రభుత్వం రైతులకు నష్టపరిహారాన్ని చెల్లించి, సాగునీటినందించి శాశ్వత పరిష్కారానికి అధికారులు చర్యలు చేపట్టి రైతాంగాన్ని ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఉదయ సముద్రం ప్రాజెక్టు ద్వారా నీటిని అందించాలి..
నార్కట్ పల్లి మండలంలోని బ్రాహ్మణ వెల్లంల గ్రామంలో ఉన్న ఉదయ సముద్రం ప్రాజెక్టు ద్వారా సమీప మండలాలైన చిట్యాల, మునుగోడు మండలాలలోని వివిధ గ్రామాల చెరువులను కాలువల ద్వారా నీటిని అందించి నింపడం వలన బోరు బావులలో భూగర్భ జలం పెరుగుతుందని, తద్వారా నీటి ఎద్దడి సమస్యను పరిష్కరించవచ్చునని రైతులు వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ప్రభుత్వం, సంబంధిత అధికారులు తక్షణ చర్యలు చేపట్టి రైతాంగాన్ని ఆదుకోవాలని ఇదే శాశ్వత పరిష్కారమని వ్యవసాయదారులు కోరుతున్నారు.
నీటిని అందించి రైతాంగాన్ని ఆదుకోవాలి
బోర్లు ఎండిపోయి వరి పొలాలకు నీరు అందక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి నార్కట్ పల్లి మండలంలోని ఉదయ సముద్రం నీటిని కాలువల ద్వారా చిట్యాల మండలంలోని పెద్ద కాపర్తి చెరువు నుండి చిన్న కాపర్తి, కిష్టాపురం, తాళ్ల వెల్లంల, మునుగోడు మండలంలోని ఉకొండి, సింగారం, మునుగోడు, పులిపలుపుల కలవలపల్లి వంటి గ్రామాలకు నీటిని అందించడం వలన భూగర్భ జలాలు పెరుగుతాయి. దీంతో రైతులు పంట నష్టపోకుండా కాపాడుకోగలుగుతారు.
అజయ్‌కుమార్ రెడ్డి రైతురత్న అవార్డు గ్రహీత




