దోమలు బాబోయ్ దోమలు!
నెల్లికుదురులో పడకేసిన పారిశుధ్యం
మహబూబాబాద్, మార్చి 18 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలో దోమల బెడద విపరీతంగా పెరిగిపోయిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం అయిందంటే చాలు దోమల జోరు తో ఒక్క చోట నిమిషం నిలబడే పరిస్థితి లేకుండా పోయిందంటున్నారు. మండల కేంద్రంలో దోమల నివారణకు పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు.
పరిసరాల అపరిశుభ్రత, పూ పోయిన మురుగు కాలువల వల్ల దోమల జోరు పెరిగిపోయిందని చెబుతున్నారు. మండల కేంద్రంలో అనేక వీధుల్లో ఉన్న డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని, కాలువలు పూర్తిగా శిథిలావస్థకు చేరాయని, దీనికి తోడు శుభ్రం చేయకపోవడంతో చెత్త పూర్తిగా నిండిపోయి మురుగునీరు ఎక్కడికక్కడే నిలిచిపోతోందని, దీనివల్ల దోమలు వ్యాప్తి చెందడానికి కారణం అవుతున్నాయని చెబుతున్నారు.
అలాగే దోమల నివారణకు పంచాయతీ సిబ్బంది, పాలకమండలి కూడా పట్టించుకోవడంలేదని, దోమల వ్యాప్తి అరికట్టడానికి ఫాగింగ్ చేయడం లేదని ఆరోపిస్తున్నారు. ఫలితంగా దోమల జోరు నెల్లికుదురు మండల కేంద్రంలో విపరీతంగా పెరిగిపోయి ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని, అలాగే సైడ్ కాలువల్లో మురుగునీరు ఎక్కడికికక్కడే తిష్ట వేయడం వల్ల పరిసరాలు దుర్గంతో ముక్కుపుటలు అదురుతున్నాయని చెబుతున్నారు.
ఇప్పటికైనా పంచాయతీ పాలకమండలి, సిబ్బంది స్పందించి మురుగు కాలువలను శుభ్రం చేసి, దెబ్బతిన్న సైడ్ కాలువలకు మరమ్మతులు నిర్వహించి, దోమల వ్యాప్తి నివారణకు ఫాగింగ్ చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఫాగింగ్ చేయిస్తాం
నెల్లికుదురులో దోమల నివారణకు ఫాగింగ్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఒకటి రెండు రోజుల్లో ఫాగింగ్ చేయిస్తాం. మండల కేంద్రంలో సైడ్ కాలువల మరమ్మతులు, పరిశుభ్రతపై కొత్తగా పంచాయతీ పాలకమండలి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నాం. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం.
- రాజేష్, పంచాయతీ కార్యదర్శి




