26 June, 2026 | 2:10 AM

ఫీజు బకాయిలు ఇవ్వకపోతే ఆమరణ దీక్ష

26-06-2026 12:57 AM

జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య హెచ్చరిక

ముషీరాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల జీవితాలతో ముఖ్యమంత్రి చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. 

గురువారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో నీల వెంకటేష్ ముదిరాజ్, తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పగిళ్ల సతీష్ కుమార్, రాష్ట్ర కన్వీనర్ పల్ల గొర్ల రాందేవ్ యాదవ్  అధ్యక్షన జరిగిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య మాట్లాడారు.

ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలపై మంత్రులు, అధికారులు సానుకూలంగా ఉన్నప్పటికీ సీఎం ఈ పథకాన్ని ఎత్తివేయాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. బకాయిల కారణంగా విద్యార్థులు ఉన్నత విద్యను కొనసాగించలేక పోతున్నారని, వారి బాధలు రాష్ట్రానికి మంచిది కాదని ఆయన అన్నారు. ప్రభుత్వం కనీసం రూ.5వేల కోట్ల బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, కళాశాల యాజమాన్యాలను తాను ఒప్పిస్తానని తెలిపారు.

ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈనెల 30న రాష్ట్ర వ్యాప్తంగా కళాశాల విద్యార్థులు తరగతులను బహిష్కరించి కలెక్టరేట్లు, ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలను ముట్టడించాలని పిలుపునిచ్చారు. వచ్చే నెలలో ఐదు లక్షల మందితో హైదరాబాద్ నగరాన్ని దిగ్బంధిస్తామని హెచ్చరించారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని, అనంతరం చోటుచేసుకునే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని కృష్ణయ్య స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీసీ ఐక్య కులాల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అనంతయ్య, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సీ.రాజేందర్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పగిళ్ల సతీష్ కుమార్,  రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోడీ రాందేవ్ యాదవ్ పాల్గొన్నారు.