26 June, 2026 | 2:10 AM

ఒక్క ఓటు కూడా తొలగిపోకుండా అప్రమత్తంగా ఉండాలి

26-06-2026 12:59 AM

మంత్రి పొన్నం ప్రభాకర్

ఖైరతాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ప్రజలు, పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా వ్యవహరించకపోతే అర్హత ఉన్న ఓట్లు కూడా తొలగిపోయే అవకాశం ఉందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. బంజారాహిల్స్ రోడ్ నెం.7లోని వెంకటేశ్వర కాలనీలో గురువారం ప్రారంభమైన ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని స్థానికులకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్,ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మార్యో అనితా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీఎల్‌ఓలు, బీఎల్‌ఏలతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓటరు నమోదు, సవరణలపై ప్రజలకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బీఎల్‌ఓలు అందజేసే ఎన్యూమరేషన్ ఫారాలను ప్రతి కుటుంబం తప్పనిసరిగా పూర్తి చేసి సమర్పించాలని సూచించారు. అలా చేయడం ద్వారా ఓటు హక్కు సురక్షితంగా ఉంటుందని, ఓటరు జాబితా నుంచి పేర్లు తొలగిపోయే ప్రమాదం తగ్గుతుందని తెలిపారు.

ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల సందర్భంగా పెద్ద ఎత్తున ఓట్లు తొలగింపుకు గురైన ఉదాహరణలు ఉన్నాయని గుర్తుచేసిన మంత్రి, తెలంగాణలో అలాంటి పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో గణనీయ సంఖ్యలో తటస్థ ఓటర్లు ఉన్న నేపథ్యంలో ప్రతి అర్హుడి ఓటు జాబితాలో కొనసాగేందుకు చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 35 వేల పోలింగ్ కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున బూత్ లెవల్ ఏజెంట్లను నియమించినట్లు ఆయన వెల్లడించారు.

బీఎల్‌ఏలు, బీఎల్‌ఓలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ అర్హత కలిగిన ఓటర్ల పేర్లు జాబితాలో కొనసాగుతున్నాయో లేదో పర్యవేక్షించాలని సూచించారు. ఓటరు సవరణ ప్రక్రియపై ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు, ఏఐసీసీ నాయకత్వం నిరంతరం మార్గనిర్దేశం చేస్తోందని పేర్కొన్న మంత్రి, పాత మరియు తాజా ఓటరు జాబితాలను సరిపోల్చి పరిశీలించడం ద్వారా ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోకుండా చూడాలని కార్యకర్తలకు సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అత్యంత విలువైన హక్కు అని, దాన్ని కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.