17 June, 2026 | 2:31 AM

క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం

17-06-2026 01:13 AM

భువనేశ్వర్, జూన్ 16: భారత రక్షణ సామర్థ్యాలకు భారీ ఊతమిస్తూ, రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన సుదూర భూతల భూతల దాడి క్రూయిజ్ క్షిపణి (ఎల్‌ఆర్‌ఎల్‌ఎసిఎం) ప్రయోగ పరీక్ష విజయవంతమైంది. ఒడిశా తీరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ఈ పరీక్ష విజయవంతంగా నిర్వహించారు. చాందీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌లో ఏర్పాటు చేసిన వివిధ ట్రాకింగ్ పరికరాల ద్వారా సేకరించిన డేటా ప్రకారం, పరీక్ష లక్ష్యాలన్నీ పూర్తిగా నెరవేరినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ఆర్ అండ్ డీ విభాగం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. 

ఈ క్షిపణి అమెరికా తోమాహాక్‌తో సమానమైదిగా అభివర్ణిస్తున్నారు. భారతదేశ క్షిపణి సామర్థ్యంలో ఇదో మైలురాయిగా రక్షణ శాఖ పేర్కొంటూ సంతోషం వ్యక్తం చేసింది. భూతల లక్ష్యాలపై దాడి చేసే దీర్ఘశ్రేణి ప్రయోగానికి సంబంధించిన లక్ష్యాలు నెరవేరాయని పేర్కొంది. ‘వే పాయింట్ నేవిగేషన్’ను ఉపయోగించుకొని నిర్దేశిత మార్గంలో లక్ష్యాన్ని చేధించింది.

ఎత్తు, వేగం, విన్యాసాల్లో సామర్థ్యాన్ని చాటిందని స్పష్టం చేసింది. ఈ క్షిపణి తక్కువ ఎత్తులో పయనిస్తూ రాడార్ల కంట పడకుండా తప్పించుకోవడం దీని ప్రత్యేకత. శత్రు భూభాగంలో లక్ష్యాలను ఇది ఖచ్చితంగా చేధిస్తుంది. డీఆర్డీవో, ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్‌లు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. వెయ్యి నుంచి -1,500 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుంది. దీనిని సరిహద్దు వద్ద మోహరిస్తే పాక్, చైనాలకు దడ పుట్టించడం ఖాయం. ఈ రెండు దేశాలకు చెందిన అనేక సైనిక, ఆర్థిక, ఆయుధ కేంద్రాలు క్షిపణి పరిధిలోకి వస్తాయి. క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం పట్ల కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు.