19 May, 2026 | 2:11 AM

మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలను పండించాలి

19-05-2026 01:00 AM

బోధన్, మే 18(విజయ క్రాంతి): రైతులు డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయాలని, యూరియా వాడకాన్ని తగ్గించాలని రుద్రూర్ వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. సోమవారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద స ప్రాంతీయ చెరుకు, వరి పరిశోధన స్థానం రుద్రూర్ శాస్త్రవేత్తలు వ్యవసాయ శాఖ సమన్వయంతో రైతులకు అవగాహనా కార్యక్రమం ను నిర్వహించారు.

ఇందులో భాగంగా ఎం. సాయి చరణ్, కీటక శాస్త్రవేత్త మాట్లాడుతూ రైతులందరు తప్పనిసరిగా నేల పరీక్షలు చేయించుకోవా లన్నారు, అవసరం మేరకే యూరియా వినియోగించి పంట సాగు ఖర్చు తగ్గించుకోవాలని సూచించారు. యూరియా అధిక వాడకం వల్ల పంటలలో రసం పీల్చే పురుగులు, వరి లో సుడి దోమ, బాక్టీరియా ఎండాకు తెగులు ఉధృతి అధికమవుతుందని తెలిపారు. పొలం లో కాండం తోలుచు పురుగు యొక్క ఉధృతి ఆర్థిక పరిమిత స్థాయిని దాటినప్పుడు మాత్రమే రసాయన మందులు వినియోగించాలని అన్నారు,

చీడ పీడల నుండి రక్షించడం కోసం కేవలం రసాయన మందుల్ని విచక్షణారహితంగా పిచికారి చేయకుండా సమగ్ర సస్య రక్షణ చర్యలు పాటించాలని సూచించారు. అదే విధంగా సేంద్రియ విధానం లో పంట సాగు, పంట మార్పిడి, బిందు, తుంపర సేద్యం వంటి విషయాలను చర్చించారు. మండల వ్యవసాయ అధికారి జె వెంకటేష్, వ్యవసాయ విస్తరణ అధికారి మధుసూదన్,  చెలిమల శ్రీనివాస్,  గ్రామ సర్పంచ్, చిన్న బాలరాజ్ ,మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్, కొమరి గంగాధర్, వి డి సి చైర్మన్, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.