21 March, 2026 | 6:10 PM

పంట నష్టపరిహారం చెల్లించాలి

21-03-2026 04:13 PM

నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి.. 

తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం  కార్యదర్శి ముత్యాల విశ్వనాథం

పాల్వంచ, (విజయక్రాంతి): అకాల వర్షాలకు దెబ్బతిన్న  పంటలకు  ఎకరాకు రూ 50 వేలు చెల్లించి,  నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం (ఏఐకేఎస్) జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల విశ్వనాథం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల పరిధి కోడిపుంజుల వాగు పూసలు తండా గ్రామంలో  శుక్రవారం రాత్రి కురిసిన వడగండ్ల వర్షానికి ధ్వంసమైన  మొక్కజొన్న పంటను పార్టీ, రైతు సంఘం నాయకులతో కలిసి శనివారం పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట చేతికి వచ్చిన దశలో  అకాల వర్షానికి దెబ్బతినడంతో  రైతాంగం దిక్కుతోచని  స్థితిలో పడిపోయిందని  ఆవేదన వ్యక్తం చేశారు. పాల్వంచ మండలం  ఉల్వనూరు, రేగులగూడెం, చంద్రాలగూడెం, బంజార, మల్లారం, కోడిపుంజుల వాగు, పేట చెరువు  తదితర గ్రామాలలో వడగండ్లతో  కురిసిన అకాల వర్షంతో  సుమారు 160 ఎకరాల  మొక్కజొన్న పంట నేలమట్టం అయిందన్నారు. ములకలపల్లి మండలం, లక్ష్మీదేవిపల్లి మండల పరిధి ఉమ్మడి రేగళ్ల పంచాయతీలో సైతం చేతికొచ్చిన పంట  ధ్వంసం  అయిందన్నారు.

ఆరుగాలం కష్టపడుతూ సాగు చేసిన పంట  నోటి కాడికి వచ్చిన దశలో  దెబ్బతినడంతో  రైతులు తీవ్ర ఆందోళనకు  గురి అవుతున్నారని వాపోయారు.  ఈ కార్యక్రమంలో సిపిఐ పాల్వంచ.మండల  కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచందర్రావు, రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు వైయస్ గిరి, రైతు సంఘం పాల్వంచ మండల అధ్యక్షులు. కొంగర అప్పారావు, నాయకులు అజ్మీరా శ్రీనివాస్, ఆంగోత్ బాలాజీ, జాటోత్ రమేష్, లక్ష్మణ్, గుగులోతు మోహన్ ఆంగోత్ మోహన్  తదితరులు పాల్గొన్నారు