సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరించాలి
కరీంనగర్, సెప్టెంబరు 1 (విజయ క్రాంతి): భద్రత, భరోసా లేని కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను (Contributory Pension Scheme) వెంటనే రద్దు చేసి, పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను పునరుద్ధరించాలని కరీంనగర్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి, కన్వీనర్ మడిపల్లి కాళీచరణ్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెన్షన్ అనేది బిక్ష కాదు, ఎవరి దయాదాక్షిణ్యం కాదు, ఎక్స్గ్రేషియా కాదు అది ఉద్యోగి హక్కు అని స్పష్టం చేశారు. ఉద్యోగి పదవీ విరమణ అనంతరం సామాజిక, ఆర్థిక భద్రత కల్పించడంలో పెన్షన్ కీలకమైన పాత్ర పోషిస్తుందని అన్నారు. అవసరమైన చట్టపరమైన సవరణలు చేసి, 2004 తర్వాత ప్రభుత్వ సేవలో చేరిన ఉద్యోగులందరికీ సీపీఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో టీఎస్ సీపీఎస్‌ఈయు రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి సంగేం లక్ష్మణరావు, ఎడ్ల అరవింద్ రెడ్డి, పెన్షనర్ల సంఘం నాయకులు కేశవరెడ్డి, ఎలదాసరి లింగయ్య, మోసం అంజయ్య, జాలి మహేందర్ రెడ్డి, కోశాధికారి ముప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి, నాయకులు రాగి శ్రీనివాస్, సర్దార్ హర్మీందర్ సింగ్, మారుపాక రాజేష్ భరద్వాజ్, సుమంత్ రావు, రామస్వామి, శంకర్, తదితరులు పాల్గొన్నారు.






