2 September, 2026 | 2:06 AM

రాబందుల చేతుల్లో రాష్ట్రం బందీ

02-09-2026 | 12:37am

సీఎం రేవంత్ వెయ్యిరోజుల వంచన పాలన

బీఆర్‌ఎస్‌కు భయపడే సభలకు అనుమతీయడం లేదు

తప్పుల్లో సెంచరీలు కొట్టిన డీజీపీ

బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్

హైదరాబాద్, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): అన్నింటినీ తట్టుకొని ప్రాణత్యాగానికి సైతం సిద్ధపడి మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ తీసుకువస్తే ప్రస్తుతం మన రాష్ట్రం రాబందుల చేతుల్లో బందీ అయ్యిందని బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్(BRS General Secretary RS Praveen Kumar) ఆరోపించారు.

మంగళవారం తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అంబర్‌పేటలో సీఎం రేవంత్ మాట్లాడిన మాటలు బజారు భాషగా అభివర్ణించారు. రేవంత్ వెయ్యి రోజుల పాలన కాదని వెయ్యి రోజుల వంచన, పీడన పాలన అని విమర్శించారు. అవుట్ సోర్సింగ్ సిబ్బందికి జీతాలు సరైన సమయానికి ఇవ్వడం లేదని ఆరోపించారు. లలిత కుమారికి కమిషన్ ఇస్తేనే సమయానికి జీతాలొస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.

మిర్యాలగూడలో కేటీఆర్ సభ నిరాకరణ, సరూర్‌నగర్ సభ నిరాకరణతో సీఎం రేవంత్ బీఆర్‌ఎస్‌కు భయపడుతున్నారని అర్ధమవుతుందన్నారు. బీఆర్‌ఎస్ నేతలను అనేక సందర్భాల్లో హౌస్ అరెస్టులు చేసి డీజీపీ తప్పుల్లో సెంచరీలు కొట్టారని విమర్శించారు. సీఎం మూడ నమ్మకాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. లోక్‌సభలో రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలు, హాజరైన రోజులు అంతంతే అన్నారు. సాక్షాత్తూ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీకి ఎన్నిసార్లు వచ్చారని, ఢిల్లీకి మాత్రం 77 సార్లు వెళ్లారని చురకలంటించారు.

ఫోన్‌ట్యాపింగ్ కేసును పక్కతోవ పట్టించి బీఆర్‌ఎస్ నేతలను ఇరికించాలని చూస్తున్నారని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఇకనైనా రేవంత్ రెడ్డి పిచ్చి పిచ్చి ప్రేలాపణలు మానుకోవాలని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్లు రామచంద్ర నాయక్, పల్లె రవికుమార్, గాంధీ నాయక్, బీఆర్‌ఎస్ నేతలు బొమ్మెర రామమూర్తి, హరి రమాదేవి తదితరులు పాల్గొన్నారు.