ప్రభుత్వ స్కూల్స్ నిర్లక్ష్యంపై సీపీఎం ధ్వజం
ఇబ్రహీంపట్నం, జులై 3 (విజయక్రాంతి): రాగన్నగూడ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి, విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిపిఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య డిమాండ్ చేశారు. సిపిఎం బృందం శుక్రవారం స్థానిక ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను సందర్శించి సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా యాదయ్య మాట్లాడుతూ.. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు తగ్గట్లు తరగతి గదులు, తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
హైస్కూల్ విద్యార్థులకు వర్క్ బుక్స్, 6, 7 తరగతులకు హిందీ, ఇంగ్లీష్ పాఠ్యపుస్తకాలు అందలేదని, మధ్యాహ్న భోజన కార్మికులకు సుమారు రూ. 30 వేల బిల్లులు, వేతనాలు బకాయి పడ్డాయని మండిపడ్డారు. అలాగే సన్న బియ్యం పేరుతో పురుగులు పట్టిన బియ్యాన్ని సరఫరా చేస్తున్నారని, ఖాళీగా ఉన్న అటెండర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
అధికారులు స్పందించి ఈ సమస్యలను పరిష్కరిస్తేనే ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ సంస్థలకు పోటీగా నిలబడతాయని ఆయన పేర్కొన్నారు.కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు డి. కిషన్, ఎం. సత్యనారాయణ, ఎస్‌ఎఫ్‌ఐ ప్రతినిధులు పాల్గొన్నారు.






