15 June, 2026 | 1:12 AM

రైతుల ఆత్మహత్య దురదృష్టకరం

15-06-2026 12:07 AM

ఎయిర్ ఫోర్స్ సైనికాధికారి గ్రూప్ కెప్టెన్ జీ.జే. రావ్ 

ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శ

జగదేవపూర్, జూన్ 14: వ్యవసాయమే ఆధారం చేసుకొని జీవనం సాగిస్తున్న రైతులు అధైర్య పడి ఆత్మహత్య  చేసుకోవద్దనీ ఎయిర్ ఫోర్స్ మాజీ సైనికాధికారి గ్రూప్ కెప్టెన్ జీ.జే. రావ్ సూచించారు. జగదేవపూర్ మండలం నిర్మల్ నగర్, వట్టిపల్లి గ్రామాలలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆయన ఆదివారం పరామర్శించారు.

ఈ సందర్భంగా మాజీ సైనిక అధికారి కెప్టెన్ జి జే రావు మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టే రైతులు ఆత్మహత్య చేసుకోవడం చాలా దురదృష్టకరమని రైతుల ఆత్మహత్యలు దేశానికి అరిష్టమని ఆత్మహత్య చేసుకున్న రైతులందరూ దేశ సంపదని, ఆత్మహత్యతో వారి కుటుంబాలు మూడు తరాలు వెనకబడిపోతాయని ఆ వెనుకబాటుతో దేశం కూడా వెనుకబడుతుందని కాబట్టి రైతులు ఎవరు భవిష్యత్తులో ఆత్మహత్య చేసుకోవద్దని రైతాంగానికి విజ్ఞప్తి చేశాడు.

ఈ సందర్భంగా ప్రభుత్వం బాధ్యత కూడా ఉందని వారు పండించిన పంటలకు గిట్టుబాటు ధరతో పాటు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.గత మూడు దశాబ్దాలుగా దేశంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలను చూసి చలించిపోయానన్నారు.

అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు నిర్మల్ నగర్ గ్రామానికి చెందిన కర్రె మల్లేశం, వట్టిపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి వెంకటేష్ కుటుంబాలకు మానసిక  ధైర్యాన్ని నింపుతూ ఆ కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రైతు ఆత్మహత్యల పైన సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న సామాజిక కార్యకర్త పులి రాజు, హమ్మద్, కృష్ణ, అందే ప్రవీణ్, తదితరులున్నారు.