వచ్చే ఎన్నికల్లో కరీంనగర్‌లో గెలిచేది కాంగ్రెస్ పార్టీయే..
డీసీసీ అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
కరీంనగర్ క్రైం, జూన్ 14 (విజయ క్రాంతి): రాబోయే ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని డిసిసి అధ్యక్షుడు, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్‌ఐఆర్ పై కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ బీఎల్‌ఏ-2 సభ్యుల శిక్షణ కార్యక్రమం ఆదివారం నగరంలోని సీతారాంపూర్ పీఎం కన్వెన్షన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులు, లౌకికవాద ఓటర్లను లక్ష్యంగా చేసుకుని కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు.
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ప్రతి కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్త, ప్రజాప్రతినిధి చురుకుగా పాల్గొని అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో కొనసాగుతున్నాయో లేదో పరిశీలించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం బిజెపి కుట్రలను అడ్డుకొని తీరుతామని, ఓట్లు చోరీ కాకుండా ప్రతి కార్యకర్త సైనికుల వలె అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. మాస్టర్ ట్రైనర్, పీసీసీ ఉపాధ్యక్షుడు నమిండ్ల శ్రీనివాస్ మా ట్లాడుతూ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో పార్టీ శ్రేణులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
ఈ నెల 25 నుంచి ప్రారంభమయ్యే కార్యక్రమంలో బూత్ స్థాయి నా య కులు, ఏజెంట్లు, కార్యకర్తలు పూర్తి స్థాయిలో పాల్గొని ప్రతి ఓటును రక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలన్నారు. సంబంధం లేని కేసులో మీనాక్షి నటరాజన్ నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారని, కేంద్ర ప్రభుత్వం ఓటు చోరీయే కాకుండా సీట్ చోరీ కూడా చేస్తున్నదని మండిపడ్డారు.
నిష్పక్షపాతంగా నిజాయితీగా గాంధీయవాది పద్ధతిలో ముందుకు వెళుతున్న మీనాక్షి నటరాజ్ నామినేషన్ తిరస్కరించడం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం,మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, అర్బన్ డీసీసీ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్, కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, పాల్గొన్నారు.






