చీరల పంపిణీలో కాంగ్రెస్ విపరీత చర్యలు
చీరల పంపిణీకి ఐరిస్ పరీక్షలు అవసరమా?
ఎమ్మెల్యే కృష్ణారావు
కూకట్ పల్లి, జూన్ 24: రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అందజేస్తున్న చీరల పంపిణీలో కాంగ్రెస్ నాయకులు విపరీత చర్యలు చేస్తున్నారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మహిళలకు ఇస్తున్న చీరల పంపిణీ కార్యక్రమాలలో కాంగ్రెస్ నాయకులు ఇష్టానుసారంగా విపరీత ధోరణితో ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.
మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగే విధంగా చీరల పంపిణీ కా ర్యక్రమాలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో కుల మతాలకతీతంగా మహిళలు అందరికీ చీరల పంపిణీ చేసినట్టు ఆ యన గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మహిళ పొదుపు సంఘాల సభ్యులకు మాత్రమే ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు.
ప్రభుత్వం అందిస్తున్న ఉచిత చీరల పంపిణీ కార్యక్రమంలో మహిళలకు ఐరిష్ పరీక్ష నిర్వహించాల్సిన అవసరమేముందని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒకవైపు ఆధార్ కార్డులను తీసుకోవడం, మరోవైపు పరీక్షలు నిర్వహించడం మహిళలకు ఇచ్చిన చీరను ఒంటిపై కప్పి ఫోటోలను తీయడం వంటి చర్యలను ప్రభుత్వం ఏ విధంగా సమర్థిస్తుందని, అధికారులు సమాధానం చెప్పా లని ఆయన డిమాండ్ చేశారు.
ఆనాడు కేసిఆర్ చేనేత కార్మికులకు అండగా ఉండేందుకు ఆడబిడ్డలకు పుట్టింటి సారేగా మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారని గుర్తు చేశారు. చేనేత కార్మికులకు ఉపాధి మార్గం దొరుకుతుందన్న ఉద్దేశంతో ఈ కా ర్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి రంజాన్, క్రిస్మస్, బతుకమ్మ, పండుగలకు ఆడబిడ్డలందరికీ ప్రతి ఒక్కరికి చీరలు పంపిణీ చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎక్కడ ఉప ఎన్నికలు ఉంటాయో, ఎక్కడ వారికి అనుకూలంగా ఉంటారో అక్కడ పంపిణీ చేస్తున్నారే తప్ప నిరుపేద మహిళలందరికీ ఉచిత చీరలు అందడం లేదని విమర్శిం చారు. ప్రభుత్వం ఈ చర్యలను ఏ విధంగా సమర్ధించుకుంటున్నదని ప్రశ్నించారు.






