7 April, 2026 | 3:49 AM

ప్రజావాణికి 95 ఫిర్యాదులు

07-04-2026 12:01 AM

నిజామాబాద్, ఏప్రిల్ 6 (విజయక్రాంతి) : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 95 ఫిర్యాదులు అందాయి.

జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, దిలీప్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, డీఆర్డీఓ సాయాగౌడ్, ఆర్డీఓ రాజేంద్రకుమార్, ఆర్మూర్ ఏ.సీ.పీ వెంకటేశ్వర్ లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

 మండల స్థాయి సభలను విజయవంతం చేయాలి : కలెక్టర్ 

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన  ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ నెల 16వ తేదీన జరిగే మండల స్థాయి సభలు విజయవంతం అయ్యేలా కృషి చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ నెల 2న నిర్వహించిన గ్రామ సభలు పూర్తి స్థాయిలో విజయవంతం అయ్యాయని, అదే స్పూర్తితో మండల స్థాయి సభలను కూడా సమర్ధవంతంగా జరిగేలా చూడాలన్నారు.

మండల సభ నిర్వహణ సమయానికి ముందే ఇందిరమ్మ ఇళ్ళ పెండింగ్ బిల్లులు, రేషన్ కార్డులు, పెన్షన్ లు వంటి వాటికి సంబంధించి గ్రామ సభలలో అందిన దరఖాస్తులను తప్పనిసరిగా పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.  కాగా, జనాభా గణనకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, అన్ని మున్సిపల్ పట్టణాలు, మండలాలలో ఈ ప్రక్రియ క్షేత్రస్థాయిలో కొనసాగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.  సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.