2 September, 2026 | 12:06 AM

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

01-09-2026 | 11:23pm

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

బెల్లంపల్లి,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లాలోని బెల్లంపల్లి మండల కేంద్రంలో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ తో కలిసి సందర్శించారు. భోజనశాల నిర్మాణ పనులను పరిశీలించారు. బెల్లంపల్లిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించారు. మండలంలోని చాకేపల్లి గ్రామంలో మండల తహసిల్దార్ కృష్ణ, సర్వే అధికారులతో కలిసి రీ సర్వే ప్రక్రియను ప్రారంభించారు. ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం కోసం భూభారతి చట్టాన్ని తీసుకోచ్చామన్నారు.

రెవెన్యూ సదస్సులు, భూ సమస్యల శాశ్వత పరిష్కారంకోసం రీ-సర్వేలు జరుగుతున్నాయని తెలిపారు. జిల్లాలో 11 నాన్ కడస్టల్ గ్రామాలు, 70 కడస్టల్ గ్రామాలు మొత్తంగా 81 గ్రామాలు రీ -సర్వేకు ఎంపిక అయ్యాయనన్నారు. తెలంగాణ సర్వే,బౌండరీ చట్టం ప్రకారం రీ -సర్వే జరుగుతుందని, క్షేత్రస్థాయిలో అమలు చేయాలని ఆదేశించారు. గ్రామసభల ద్వారా పట్టదారులకు సమాచారం అందించాలన్నారు. మొదట గ్రామసభ ప్రజలకు సమాచారం అందించి గ్రామ సరిహద్దును  ఖచ్చితంగా ఫీల్డ్ రిజిస్టర్ నిర్వహించాలన్నారు. ప్రతి బృందం లక్ష్యానికి అనుగుణంగా కార్యాచరణ రూపొందించుకొని సర్వే పనులను పూర్తి చేయాలని తెలిపారు. గ్రామాల హద్దుల నిర్ధారణకు సంబంధించిన సమాచారం సర్పంచ్ లు, రైతులకు అందించాలని, రీ-సర్వే ప్రక్రియలో ప్రజల సహకారం తీసుకుని పారదర్శకంగాపూర్తి చేయాలన్నారు.

అనంతరం తాండూర్ మండలంలో పర్యటించారు. మధునాపూర్ గ్రామ శివారులో వరి సాగు చేస్తున్న రైతులతో బెల్లంపల్లి సబ్ కలెక్టర్, మండల తహసిల్దార్ జ్యోత్స్నతో కలిసి మాట్లాడారు. ఎల్ నినో ప్రభావంతో లోటు వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉందని, వ్యవసాయ, వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. మండల తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో నోటీసుల ప్రక్రియ నిర్వహణ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా నో మ్యాపింగ్, అనమలిస్ జాబితాలో నోటీసులు ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని, నిర్ణీత గడువులోగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూ వివాదాల పరిష్కారం కోసం చేపట్టిన రీ సర్వే ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని తెలిపారు. భూముల రిజిస్ట్రేషన్ సమయంలో తహసిల్దార్ కార్యాలయాలలో సీలింగ్ డిక్లరేషన్‌ను పరిశీలించి, నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టాలని సూచించారు. భూభారతి దరఖాస్తులలో భూమి విస్తీర్ణ  వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి,రికార్డులతో సరిపోల్చి చర్యలు చేపట్టాలన్నారు.