డిల్లీ నడిబొడ్దున కదం తొక్కిన భద్రాద్రి జిల్లా సీపీఐ శ్రేణులు
లక్షలాది మందికి పోరాట స్ఫూర్తినిచ్చిన రాంలీలా మైదాన్ సభ
మార్పుకోసం జరిగే పోరాటాల్లో భద్రాద్రి జిల్లా అగ్రభాగం
సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా
కొత్తగూడెం, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): దేశంలో మార్పు కోసం కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై రాజీలేని సమరశీల పోరాటాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని, ఆ పోరాటాలలో భద్రా ద్రి కొత్తగూడెం జిల్లా శ్రేణులు ఎల్లప్పుడూ అగ్రభాగాన ఉంటాయని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా స్పష్టం చేశారు.
దేశంలో మార్పు రావాలనే ప్రధాన నినాదంతో ’బద్లావ్ జరూరిహై’ దేశ రాజధాని న్యూఢిల్లీలోని చారిత్రాత్మక రాంలీలా మైదానంలో మంగళవారం నిర్వహించిన భారీ బహిరంగ సభకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నలుమూలల నుంచి 500 మందికి పైగా సిపిఐ శ్రేణులు, కార్మికులు, రైతులు, ప్రజలు భారీ ఎత్తున తరలివెళ్లారు. అజ్మీరీ గేట్ సెంటర్ నుంచి రాంలీల మైదానం వరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిపిఐ నాయకులు కార్యకర్తలు భారీ ప్రదర్శన నిర్వహించారు.
ర్యాలీని ప్రారంభించిన సందర్భంగా సాబీర్ పాషా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా, విద్యార్థి, నిరుద్యోగ, మహిళా వ్యతిరేక విధానాల వల్ల దేశంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తూ, సామాన్య ప్రజల హక్కులను కాలరా స్తున్న పాలకుల తీరును ఎండగట్టేందుకే రాంలీలా మైదానంలో ఈ మహా గర్జన నిర్వహించామని తెలిపారు. నాయకులు కల్లూరు వెంకటేశ్వరరావు, మేయర్ మూడ్ గణేష్, సలిగంటి శ్రీనివాస్, మున్నా లక్ష్మీకుమారి, సరెడ్డి పుల్లారెడ్డి, కంచర్ల జమలయ్య, బి పూర్ణచంద్రరావు, మువ్వ వెంకటేశ్వరరావు, చంద్ర నరేంద్ర కుమార్, ఉప్పుశెట్టి రాహుల్, అడుసుమిల్లి సాయిబాబా, కార్పొరేటర్లు సర్పంచులు, పాల్గొన్నారు.






