దృఢమైన చిన్నారులతోనే బలమైన దేశ నిర్మాణం
పోషణ మాసోత్సవాన్ని ప్రారంభించిన ఎంపీ కె.లక్ష్మణ్
ముషీరాబాద్, సెప్టెంబర్ 1(విజయక్రాంతి): ఆరోగ్యవంతమైన, దృఢమైన చిన్నారులతోనే బలమైన భారతదేశాన్ని నిర్మించగలమని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు. మంగళవారం గగన్మహల్లోని ఏవీ కళాశాల ప్రాంగణంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోషణ మాసోత్సవం2026 ఐకాప్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. పోషకాహారంపై విద్యార్థులు, యువతలో అవగాహన పెంచాలని డాక్టర్ లక్ష్మణ్ పిలుపునిచ్చారు.
రక్తహీనత, తక్కువ బరువు, అధిక బరువు, ఊబకాయం, ఎదుగుదల లోపం వంటి సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. చిరుధాన్యాలు, సంప్రదాయ ఆహార పద్ధతులను ప్రోత్సహించాలని సూచించారు. తెలంగాణలో వయస్సుకు తగిన శారీరక ఎదుగుదల లేని చిన్నారుల నిష్పత్తి 33 శాతం నుంచి 27 శాతానికి తగ్గిందని తెలిపారు. అంగన్వాడీ సిబ్బంది, క్షేత్రస్థాయి సిబ్బంది కృషితో ఈ మెరుగుదల సాధ్యమైందన్నారు.
పోషకాహారంతో పాటు క్రీడలు, వ్యాయామం, యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని విద్యార్థులకు సూచించారు. పీఐబీ/సీబీసీ అదనపు డైరెక్టర్ జనరల్ శ్రుతి పాటిల్ మాట్లాడుతూ పోషకాహారం ఆరోగ్యం, ఉత్పాదకత, అభ్యాసం, జీవన నాణ్యతతో ముడిపడి ఉందన్నారు. సంప్రదాయ జానపద కళల ద్వారా పోషకాహార సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏవీ ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి అచ్యుత్ ప్రసాద్ రెడ్డి, ఏవీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పద్మ, పీఐబీ, సీబీసీ అధికారులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 1 నుంచి 5 వరకు జరిగే కార్యక్రమంలో పోషకాహార ప్రదర్శనలు, నిపుణుల ప్రసంగాలు, ఐఈసీ స్టాళ్లు, ఒగ్గుకథ, వీధి నాటకం, కోలాటం, యక్షగానం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.






