పెట్టుబడులకు కెనడా ఆసక్తి
- సీఎం రేవంత్‌రెడ్డితో హైకమిషనర్ భేటీ
- వ్యాపార, వాణిజ్య అంశాలపై చర్చ
- కెనడాలో పర్యటించాలని సీఎంకు ఆహ్వానం
హైదరాబాద్, జూలై 8 (విజయక్రాంతి) : కెనడా హైకమిషనర్ క్రిస్ కూటర్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కెనడా మధ్య వ్యాపార, వాణిజ్య, పెట్టుబడులు, ఆవిష్కరణల రంగాల్లో భాగస్వామ్యం మరింత బలోపేతం చేసే అంశాలతో పాటు మౌలిక వసతుల ప్రాజెక్టులు, పట్టణాభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. మూసీ నది పునరుజ్జీవం, హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ, ఫ్యూచర్ సిటీ వంటి ప్రాజెక్టుల్లో కెనడా భాగస్వామ్యానికి ఉన్న అవకాశాలపై చర్చలు జరిపారు.
కెనడాకు చెందిన ప్రముఖ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడం సంతోషకరమని హైకమిషనర్ పేర్కొన్నారు. ఫిరాన్ టెక్నాలజీ గ్రూప్, హైదరాబాద్‌లో తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించడం, సీఐబీసీ (సీఐబీసీ) హైదరాబాద్‌లో తన గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ (జీసీసీ)ను ప్రారంభించడం వంటి పరిణామాలు తెలంగాణపై నమ్మకం, విశ్వాసానికి నిదర్శనమన్నారు. క్యాపిటల్ సంస్థ సీపీపీ ఇన్వెస్ట్మెంట్స్ హైదరాబాద్‌కు చెందిన సీటీఆర్ ఎల్‌ఎస్ డేటా సెంటర్ల భాగస్వామ్యంతో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావడం తెలంగాణ సామర్థ్యాన్ని మరింత బలపరిచిందని చెప్పారు.
జీసీసీల హబ్‌గా హైదరాబాద్
తెలంగాణ ఐటీ, లైఫ్ సైన్సెస్, రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో సాధించిన పురోగతిని క్రిస్ కూటర్ బృందానికి సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. ప్రపంచంలోని ఫార్చ్యూన్- 500 కంపెనీల గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు (జీసీసీలు) హైదరాబాద్‌ను కేంద్రంగా ఎంచుకుంటున్నాయని తెలిపారు. మూసీ నది పునరుద్ధరణను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిందన్నారు.
సౌర విద్యుత్ విస్తరణ, హరిత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి సహకారం అందించాలని, కెనడాకు చెందిన ప్రముఖ విశ్వవిద్యాలయాలు హైదరాబాద్‌లో మల్టీ-యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటు అవకాశాన్ని పరిశీలించాలని సూచించారు. ఈ ఏడాది డిసెంబర్‌లో జరగనున్న రెండో తెలంగాణ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌లో పాల్గొనాలని కెనడా కంపెనీలు, పెట్టుబడిదారులు, విద్యాసంస్థలను సీఎం రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు.
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు అన్ని విధాలా సహకరిస్తామని హైకమిషనర్ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిని కెనడా పర్యటనకు ఆహ్వానించారు. సమావేశంలో సీఎం సలహాదారు, ఎక్స్-అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, ఇన్వెస్ట్ తెలంగాణ సీఈఓ బి. అజిత్ రెడ్డి, టీజీఐఐసీ ఎండీ శశాంక, ఐటీ,ఈ అండ్ సీ జాయింట్ సెక్రటరీ అనుదీప్ దురిశెట్టి, పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.






