కల్లూరులో గంజాయి రవాణా గుట్టు రట్టు.. ముగ్గురు అరెస్ట్
రూ.1.50 లక్షల విలువైన 3 కేజీల గంజాయి స్వాధీనం
కల్లూరు, జూలై 14(విజయ క్రాంతి): అక్రమ గంజాయి రవాణా,విక్రయాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను కల్లూరు పోలీసులు అరెస్ట్ చేసి,వారి వద్ద నుంచి రూ.1,50 లక్షల విలువైన 3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల వివరాల ప్రకారం కల్లూరు పట్టణానికి చెందిన షేక్ హబీబ్, బొడ్డు చందు ఇద్దరూ గంజాయి సేవించే అలవాటు కలిగిన స్నేహితులు. గతంలో 2025లో ఒడిశా రాష్ట్రంలోని మల్కనగిరి ప్రాంతానికి వెళ్లి గంజాయి కొనుగోలు చేసి కల్లూరులో చిన్న ప్యాకెట్లుగా విక్రయిస్తూ పట్టుబడి జైలుకు వెళ్లారు.
అనంతరం విడుదలైన హబీబ్ కొంతకాలం సవ్యంగా జీవనం సాగించినప్పటికీ,మళ్లీ పాత అలవాటుకు లోనయ్యాడు. ఇటీవల మణుగూరులో తేజావత్ రమేష్ను కలుసుకుని కలిసి గంజాయి సేవించారు. తర్వాత మళ్లీ పెద్ద మొత్తంలో గంజాయి వ్యాపారం చేయాలని నిర్ణయించి, జూలై 7న ఒడిశా రాష్ట్రం మల్కనగిరికి వెళ్లి గంజాయి కొనుగోలు చేశారు.రమేష్ వాహనం ఏర్పాటు చేయడంతో వాటాలో భాగంగా అర కేజీ గంజాయి ఇచ్చారు.కల్లూరు చేరుకున్న అనంతరం, పేరువంచ గ్రామానికి చెందిన ప్రవీణ్,చిన్న ప్రవీణ్, హరీష్లతో సంప్రదించి గంజాయి విక్రయానికి ఒప్పందం కుదుర్చుకున్నారు.మొత్తం మూడు కేజీల గంజాయిని విక్రయించి మరలా పెద్ద స్థాయిలో వ్యాపారం చేయాలని యోచించారు.
జూలై 13న బండిపై పేరువంచ వైపు వెళ్తుండగా,షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో హబీబ్,చందు,రమేష్లు పట్టుబడ్డారు.వారి వద్ద ఉన్న 3 కిలోల గంజాయి (ప్రతి కేజీ రూ.50,000 విలువ)ను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను సర్కిల్ ఇన్స్పెక్టర్ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది. ఎస్‌ఐ హరిత, హెడ్ కానిస్టేబుళ్లు నరసింహారావు, లక్ష్మీపతి, కానిస్టేబుళ్లు శ్రీనివాసరావు, సత్యనారాయణ, రఫీ, విజయ్, రంగారావు తదితరులు కేసు దర్యాప్తులో పాల్గొన్నారు.






