ఘనంగా బోనాల పండుగ
అడ్డాకుల ఆగస్టు 28: మండలంలోని వివిధ గ్రామాల్లో బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామాల్లోని అమ్మవారి ఆలయాలను ప్రత్యేకంగా అలంకరించి, మహిళలు సంప్రదాయబద్ధంగా బోనాలను సమర్పించి అమ్మవారికి మొక్కులు చెల్లించారు. అడ్డకల్,కన్మనూర్,బలీదుపల్లి, వర్నె, తదితర గ్రామాల్లో పండుగ సందడి నెలకొంది. ఉదయం నుంచే ఆలయాల వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మహిళలు బోనాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు.
డప్పుల మోతలు, భక్తిగీతాలతో గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. పాడిపంటలు సమృద్ధిగా పండాలని, గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు భక్తులు తెలిపారు. యువత, మహిళలు, గ్రామ పెద్దలు ఉత్సవాల్లో పాల్గొని పండుగను విజయవంతం చేశారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గ్రామాల్లో ఏర్పాట్లు చేపట్టారు. బోనాల పండుగతో గ్రామాల్లో సాంప్రదాయాలు, భక్తి భావం వెల్లివిరిశాయి.






