16 March, 2026 | 2:26 AM

టీవీకే అధినేత విజయ్‌కి బీజేపీ ఆఫర్?

16-03-2026 12:57 AM
  1. 80 సీట్లు, డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని ప్రతిపాదన

జాతీయ మీడియాలో విస్తృతమైన కథనాలు

కథనాలను ఖండించిన టీవీకే

చెన్నై, మార్చి ౧౫: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల హీట్ పెరిగిన వేళ ఆదివారం ఓ విషయంపై జాతీయ మీడియా విస్తృతంగా కథనాలు ప్రసారం చేసింది. కథనాల సారాంశమేంటంటే.. తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్‌కి బీజేపీ ఓ ఆఫర్ ఇచ్చింది. తమ కూటమిలో చేరితే టీవీకేకి ౮౦ సీట్లతో పాటు డిప్యూటీ సీఎం పదవి ప్రతిపాదించింది. రాయబారం నడిపేందుకు ఇతర రాష్ట్రాలకు చెందిన నాయకులను సైతం బీజేపీ సంధానకర్తలుగా రంగంలోకి దించినట్లు సమాచారం. ఆ రాష్ట్రంలో ఎప్పుడూ ౨శాతం ఓట్ల తేడాతో గెలుపోటములు ఖరారవుతాయి.

ఈ నేపథ్యంలో తమకున్న ఓటుశాతంతో విజయ్ చరిష్మా తోడైతే, అక్కడ తమ కూటమి అధికారంలోకి వస్తుందని బీజేపీ అంచనా వేస్తున్నది. దీనిలో భాగంగానే విజయ్‌ని బుట్టలో వేసుకునేందుకు బీజేపీ పావులు కదుపుతున్నట్లు తెలిసింది. మరోవైపు, బీజేపీ ఆఫర్ ప్రతిపాదన కథనాలను టీవీకే ఖండించింది. బీజేపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని పార్టీ జాయింట్ జనరల్ సెక్రటరీ సీటీఆర్ నిర్మల్ కుమార్ స్పష్టం చేశారు. ఒంటరిగానే 234 స్థానాల్లో పోటీ చేస్తామని ఉద్ఘాటించారు.