6 June, 2026 | 3:04 AM

సంకుచిత ధోరణితో వ్యవహరిస్తున్న బీజేపీ

06-06-2026 01:10 AM
  1. దూరదృష్టి గల నేత రాజీవ్ గాంధీ 
  2. పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్
  3. కరీంనగర్‌లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
  4. పాల్గొన్న మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ 

కరీంనగర్, జూన్ 5 (విజయక్రాంతి): రక్తం ఏరులై పారినా పర్వాలేదు కానీ మేము అధికారంలో ఉండాలనే సంకుచిత ధోరణితో బీజేపీ వ్యవహరిస్తుందని పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ బి మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మతాలు, కులాల మధ్య విద్వేషాలు పెంచుతూ బీజేపీ రాజకీయం చేస్తుందని విమర్శించారు. శుక్రవారం కరీంనగర్‌లో పర్యటించిన ఆయన సుడా నిధులతో చేపట్టిన పాత మున్సిపల్ గెస్ట్ హౌస్ ప్రారంభోత్సవం, నూతన ఫుడ్ కోర్టులకు శంకుస్థాపన, రాజీవ్ చౌక్ సుందరీకరణ పనులకు మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ భారతదేశ ఆధునీకరణకు ఆద్యం పోసిన దూరదృష్టిగల నాయకుడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని అన్నారు. రాజీవ్ గాంధీ దూరదృష్టి వల్లే శాస్త్ర, సాంకేతికరంగాల్లో దేశం ముందుందన్నారు. రాష్ట్రంలో సీఎం రేవత్ రెడ్డి నాయకత్వంలో అమలవుతున్న పథకాలు రాజీవ్ గాంధీ స్ఫూర్తితోనని అన్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి ఆనాడు రాజీవ్ గాంధీ శిలన్యాసం చేశారని అన్నారు.

రాజీవ్ గాంధీ స్ఫూర్తితో యువత ముందుకెళ్లాలని, గాంధీ మార్గాన్ని అనుసరించాలని సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరాం చక్రవర్తి, ఆర్టీఏ మెంబర్ పదాల రాహుల్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, అర్బన్ బ్యాంకు చైర్మన్ కర్ర రాజశేఖర్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.