గ్రానైట్ క్వారీలపై ఐ!
మహబూబాబాద్, కరీంనగర్ జిల్లాల్లో సీబీసీఐడీ అధికారుల తనిఖీలు
క్వారీలు, మైనింగ్ కార్యాలయాల్లో సోదాలు
2014 నాటినుంచి రికార్డుల పరిశీలన
మహబూబాబాద్/కరీంనగర్ క్రైం, జూన్5(విజయక్రాంతి): గ్రానైట్ క్వారీల్లో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో శుక్రవారం కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాల్లోని కార్యాలయాల్లో సీబీసీ ఐడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఇటీవల అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గ్రానైట్ తవ్వకాల్లో జరుగుతున్న అవకతవకలపై సీఐడీ చేత విచారణ జరిపిస్తామని ప్రకటించారు.
ఆ మేరకు విజిలెన్స్ శాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా 2014 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో నిర్వహిస్తున్న గ్రానైట్ క్వారీల వ్యవహారంపై సీబీసీఐడీ అధికారులు విచారణకు రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో శుక్రవారం విచారణకు సీబీసీఐడీ బృందాలు వచ్చాయి. హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక అధికారుల బృందం మహబూబాబాద్ జిల్లాలోని పలు గ్రానైట్ క్వారీలు, జిల్లా మైనింగ్ కార్యాలయం లో తనిఖీలు నిర్వహించారు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మైనింగ్ ఆఫీస్ తో పాటు జిల్లా పరిధిలోని కేసముద్రం, గూడూరు, ఇనుగుర్తి, నెల్లికుదురు తదితర ప్రాంతాల్లో నిర్వహిస్తున్న గ్రానైట్ క్వారీ ల వ్యవహారంపై విచారణ చేపట్టారు. కరీంనగర్ మైన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫీసులో రికార్డులు సేకరించారు.
క్వారీలకు అనుమతి ఎంతమేర కు ఇచ్చారు, నిర్వహణకు ప్రభుత్వం ఇచ్చిన లీజు ఏ మేరకు ఉంది, ఇప్పటివరకు ఎంత గ్రానైట్ వెలికి తీశారు, ఎంత సీనరేజీ చెల్లించారు, అనుమతి ఇచ్చినచోటే గ్రానైట్ తీసారా, అక్రమంగా ఏమైనా మైనింగ్ జరిగిందా, పదేళ్ల కాలంలో గ్రానైట్ క్వారీల నుంచి ఎగుమతి అయిన మెటీరియల్ వివరాలను, ఇతర వివరాలను సమగ్రంగా పరిశీలించారు.
తొలుత క్షేత్రస్థాయిలో గ్రానైట్ క్వారీల్లో సీఐడీ అధికారులు పర్యటించి, వాస్తవ పరిస్థితులను పరిశీలించారు. అనంతరం జిల్లా మైనింగ్ కార్యాలయంలో రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. గ్రానైట్ రవాణాకు సీనరేజ్ చెల్లింపులకు మధ్య వ్యత్యాసం ఉందా అన్న వివరాలు కూడా తెలుసుకునేందుకు, రైల్వే విభాగం, విదేశాలకు తరలివెళ్లిన గ్రానైట్ ఏయే పోర్టుల నుంచి వెళ్లింది, ఆయా పోర్టులకు ఎంతమేర రవాణా ఛార్జీలు చెల్లించారు, వాటి పరిమాణం ఎంత, తదితర వివరాలు సేకరించి ప్రభుత్వానికి అందిన రాయల్టీ ఎంత వచ్చిందో కూడా తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి.
వీటన్నింటిని క్రోడీకరించి ప్రభుత్వానికి ఎంతమేర నష్టం వాటిల్లిందో తేల్చనున్నట్టుగా సమాచారం. సీఐడీ అధికారులు తనిఖీలతో గ్రానైట్ క్వారీల నిర్వాహకుల్లో అలజడి సృష్టించింది. అయితే తనిఖీలకు సంబంధించిన వివరాలను వెల్లడించడానికి అధికారులు నిరాకరించారు. రాష్ర్టంలోని పెద్దపల్లి, ఖమ్మం, నాగర్‌కర్నూల్ జిల్లాల్లోనూ మైనింగ్ అక్రమాలపై అధికారులు దర్యాప్తు చేయనున్నారు.






