పర్యావరణ పరిరక్షణకు సైకిల్‌ను వినియోగించాలి
గద్వాలటౌన్, జూన్ 7: పర్యావరణ పరిరక్షణకు తక్కువ దూరాలకు వెళ్లే సమయంలో పెట్రోల్, డీజిల్ వాహనాలకు బదులుగా సైకిల్ వినియోగించాలని అదనపు కలెక్టర్ నర్సింగరావు అన్నారు. ఆదివారం ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా ఫిట్ ఇండియా ఉద్యమంలో భాగంగా నిర్వహించిన సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమంను గద్వాల ఇండోర్ స్టేడియం వద్ద నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) నర్సింగ్ రావు ఇండోర్ స్టేడియం వద్ద జెండా ఊపి సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. అనంతరం సైకిల్ ర్యాలీ ఇండోర్ స్టేడియం నుండి ప్రారంభమై పాత బస్టాండ్, కృష్ణవేణి చౌక్, అంబేద్కర్ చౌక్ మీదుగా తిరిగి ఇండోర్ స్టేడియం వరకు సాగింది.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ప్రజల్లో ఆరోగ్యకర జీవన విధానంపై అవగాహన పెంపొందించడానికి దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి డివైఎస్‌ఓ రామలింగేశ్వర గౌడ్, కరాటే కోచ్ శ్రీహరి, ఫుట్బాల్ కోచ్ విజయ్, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, క్రీడాకారులు, యువత, క్రీడాభిమానులు, తదితరులు పాల్గొన్నారు






