ప్రజాపాలన ప్రగతి నివేదిక బస్సు యాత్ర
గద్వాలటౌన్, జూన్ 7: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే లక్ష్యంతో నిర్వహిస్తున్న ప్రజా పాలనప్రగతి నివేదిక బస్సు యాత్రకు గద్వాల జిల్లా కేంద్రంలో అపూర్వ స్పందన లభించింది.నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు డా. మల్లు రవి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర గొర్రెలు మరియు మేకల అభివృద్ధి సహకార సమాఖ్య చైర్పర్సన్,గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి సరిత తిరుపతయ్య ఆధ్వర్యంలో ఈ బస్సు యాత్ర ఘనంగా నిర్వహించారు.
జిల్లా కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా వైఎస్‌ఆర్ చౌక్ వరకు సాగిన యాత్రలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు,ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని ఉత్సాహభరిత స్వాగతం పలికారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలు,సంక్షేమ పథకాలు,అభివృద్ధి కార్యక్రమాలు, రైతులు,మహిళలు, యువత,విద్యార్థుల కోసం చేపట్టిన చర్యలను ప్రజలకు వివరించేందుకు ఈ యాత్రను నిర్వహించినట్లు నాయకులు తెలిపారు.
ఈ సందర్భంగా సరిత తిరుపతయ్య మాట్లాడుతూ ప్రజా పాలనలో పారదర్శకత,సంక్షేమంలో నిబద్ధత,అభివృద్ధిలో వేగంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ తెలంగాణను సమగ్ర అభివృద్ధి దిశగా నడిపిస్తున్నామని వివరించారు.వైఎస్‌ఆర్ చౌక్ వద్ద నిర్వహించిన సభలో కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి,రాష్ట్ర వాల్మీకి ఫెడరేషన్ చైర్మన్ గట్టు తిమ్మప్ప,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులు,ఓబీసీ మాజీ చైర్మన్ నల్లారెడ్డి,గద్వాల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గంజిపేట శంకర్,డీసీసీబీ మాజీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి,జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్.తిరుమలేష్తో పాటు పట్టణ మండల కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, సర్పంచ్లు, కార్యకర్తలు,అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






