ప్లాస్టిక్ నియంత్రణపై అవగాహన
నిర్మల్ జూన్ 11 (విజయక్రాంతి): ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా, తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, నేషనల్ గ్రీన్ కోర్ (NGC) ఆధ్వర్యంలో నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నేడు అవగాహన సదస్సు నిర్వహించారు. నిర్మల్ జిల్లా పర్యావరణ విద్య ప్రిన్సిపల్ సుధాకర్ అంబాసిడర్ మరియు నేషనల్ గ్రీన్ కోర్ కోఆర్డినేటర్ డి. మోహన్ రావు మాట్లాడుతూ, విద్యార్థులు సామాజిక మాధ్యమాల (WhatsApp, Instagram, Facebook, X, YouTube) ద్వారా పర్యావరణ హిత వస్తువులపై ప్రచారోద్యమాన్ని చేపట్టాలని పిలుపునిచ్చారు.
"బట్ట సంచి ముద్దు – ప్లాస్టిక్ వద్దు"
"స్టీల్ బాటిల్ ముద్దు – ప్లాస్టిక్ బాటిల్ వద్దు"
"అరటి ఆకు ముద్దు – పేపర్ ప్లేట్ వద్దు"
అనే నినాదాలతో పర్యావరణ హిత వస్తువులతో 'సెల్ఫీ' దిగి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ప్రజలను చైతన్యపరచాలని కోరారు.
వ్యర్థాల నిర్వహణపై దిశానిర్దేశం
ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, తడి-పొడి చెత్తను శాస్త్రీయంగా వేరుచేయడంపై అవగాహన కల్పించారు. చెత్త ఉత్పత్తి అయ్యే చోటనే నాలుగు రకాలుగా విభజించడం ద్వారా కాలుష్యాన్ని అదుపు చేయవచ్చని వివరించారు. కార్యక్రమంలో భాగంగా 'ఏక్ పేడ్ మా కే నామ్' (తల్లి పేరుతో ఒక మొక్క) నినాదంతో కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ యు గంగాధర్, కళాశాల ఎకో క్లబ్ కోఆర్డినేటర్ డాక్టర్ పవన్ కుమార్, దోస్త్ కోఆర్డినేటర్ కుంటా శ్రీహరి, డాక్టర్ పి జి రెడ్డి, రమేష్ రెడ్డి, డాక్టర్ రజిత, డాక్టర్ ఉమేష్, కళాశాల సిబ్బంది, విద్యార్థులు, NSS, NCC వాలంటీర్లు పాల్గొన్నారు.






