తెలంగాణ సీఎం విజ్ఞప్తిని పరిశీలించండి
కేంద్ర జల్‌శక్తి శాఖను ప్రధానమంత్రి కార్యాలయం ఆదేశం
హైదరాబాద్, జూలై 30 (విజయక్రాంతి): తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మాణానికి సంబంధించి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన విజ్ఞప్తిపై ప్రధానమంత్రి కార్యాలయం స్పందించింది. ఈ అంశంపై రేవంత్‌రెడ్డి గత నెల 11న ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాయగా, దానిని పరిశీలించిన పీఎంవో కేంద్ర జలశక్తిశాఖకు పం పిస్తూ తమ అభిప్రాయాలను తెలియజేయాలని ఆదేశించింది. ఈ మేరకు గత నెల 25న పీఎంవో నుంచి అధికారిక లేఖ జారీ అయింది.
తుమ్మిడిహెట్టి బరాజ్‌ను ప్రాణహిత నదిపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహితచెవెళ్ల ప్రాజెక్టులో భాగంగా నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 152 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో ప్రాజెక్టును ప్రతిపాదించగా, 2016లో మహారాష్ట్రతో జరిగిన అంతర్రాష్ట్ర బోర్డు సమావేశంలో 148 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌కు అంగీకారం కుదిరిందని, అయితే ఆ తర్వాత అప్పటి ప్ర భుత్వం పనులు చేపట్టలేదని సీఎం రేవంత్‌రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు.
ప్ర స్తుతం 148 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో ప్రాజెక్టు నిర్మిస్తే గోదావరి జలాలను గ్రావిటీ ద్వారా సమర్థంగా వినియోగించుకోవడం సాధ్యం కాదని, ఎఫ్‌ఆర్‌ఎల్‌ను కొద్దిగా పెంచితే విద్యుత్ వినియోగం తగ్గడంతోపాటు దీర్ఘకాలికంగా ప్రభుత్వ వ్యయం కూడా తగ్గుతుందని సీఎం వివరించారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాలకు దీని వల్ల మరింత ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.






