31 July, 2026 | 1:25 AM

పశువుల పాక కాదు.. ప్రభుత్వ బడే!

31-07-2026 12:32 AM

హైటెక్, కార్పొరేట్ యుగంలో టార్పాలిన్ నీడలో సాగుతున్న చదువులు 

ప్రభుత్వ పాఠశాలల దుస్థితికి చక్కటి ఉదాహరణ ఇది

కామారెడ్డి జిల్లాలోని పల్లె గట్టు తండా ప్రాథమిక పాఠశాల దుస్థితి ఇది

కామారెడ్డి, జూలై 30 (విజయక్రాంతి): ప్రభుత్వ బడులను బలోపేతం చేస్తాం అంటూ ప్రభుత్వం ఒకవైపు చెప్పుతూ ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల లను తీర్చిదిద్దుతామని విద్య బోధన అందిస్తామని ప్రజా ప్రతినిధులు, అధికారులు ఒకవైపు చెపుతున్న ఆచరణలో మాత్రం అమలు కావడం లేదు. ఇందుకు సజీవ సాక్ష్యం కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని పల్లె గడ్డ తండా ప్రాథమిక పాఠశాల దుస్థితి చూస్తే అర్థమవుతుంది.

ఈ పాఠశాల గత కొన్ని సంవత్స రాలుగా గుడిసెలో విద్యాబోధన కొనసాగుతుంది. ఈ విషయాన్ని పలుమార్లు స్థానికులు ప్రభుత్వ అధికారుల దృష్టికి ప్రజాప్రతి నిధుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రాథమిక పాఠశాలకు భవన నిర్మాణం కోసం నిధులు మంజూరు చేశారు. బేస్మెంట్ వరకు నిర్మించారు. కాంట్రాక్టర్ కు డబ్బులు రాలేదని మధ్యలోనే వదిలి వెళ్ళాడు. దీంతో విద్యార్థులు వర్షాకాలం కావడంతో టార్పాలిన్ లు గ్రామస్తులు ఏర్పాటు చేయడంతో టార్పాలి కింద విద్యాబోధన సాగుతుంది.

భారీ వర్షం వస్తే విద్యార్థులను ఇంటికి పంపిస్తున్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ప్రభుత్వ పాఠశాలలను ప్రవేట్ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అన్ని మౌలిక వసతులు సమకూర్చుతామని చెప్తున్నారు. కనీస భవనం సౌకర్యం లేకుండా విద్యార్థులు టార్పాలని కింద విద్యాబోధన కొనసాగిస్తున్నారు. గతంలో ఈ పాఠశాల విద్యార్థులకు విద్యాబోధన గుడిసెలో నిర్వహించినప్పుడు 2021లో పల్లెనిద్ర కోసం వచ్చిన మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి విద్యార్థుల దుస్థితిని చూసి చలించిపోయారు.

విద్యార్థుల కష్టసుఖాలను తెలుసుకున్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. ఒకరోజు రాత్రి ఆ తండాలోనే మాజీ ఐఏఎస్ ఆకునూరు మురళి బస చేశారు. అప్పటి ప్రభుత్వాన్ని ఎండగట్టారు. ఇలాంటి విద్యావ్యవస్థపన సాగుతుందని విద్యా శాఖ పట్ల ప్రభుత్వం వైఖరి ఈ పాఠశాలను చూస్తేనే అర్థమవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో మాజీ ఐఏఎస్ ఆకునూరు మురళి అడ్వైజర్ గా సేవలందిస్తున్నారు. అతడు బస చేసిన పల్లె గడ్డ తండ ప్రాథమిక పాఠశాల దుస్థితి మాత్రం మారలేదు.

ప్రస్తుతం టార్పాలిన్లు కప్పుకొని విద్యార్థులకు ఉపాధ్యాయులు చదువు చెప్పుతున్నారు. చిన్నారుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోయింది. కేజీ నుంచి పీజీ వరకు కార్పొరేట్ విద్యను ప్రభుత్వం ఆధ్వర్యంలో ఓకే గొడుగు కిందికి తెచ్చి గురుకుల విద్యను విద్యార్థులకు అందిస్తామని చెప్తున్నా ప్రభుత్వం ఇలాంటి తండాల్లో ఉన్న ప్రాథమిక పాఠశాల దుస్థితిని పట్టించుకోవాలని తండావాసులు కోరుతున్నారు. గతంలో ఈ పాఠశాలలో 43 మంది విద్యార్థులు ఉండగా ఈ ఏడాది 26 మంది విద్యార్థులు టార్పల్లి న్ ల కింద విద్యను అభ్యాసిస్తున్నారు.

ప్రభుత్వం ఇకనైనా స్పందించి ఈ పాఠశాలకు నిధులు మంజూరు చేసి పాఠశాల భవనం నిర్మించాలని పల్లె గడ్డ తండా గిరిజనులు కోరుతున్నారు. తమ పిల్లలకు ఇతర ప్రభుత్వ పాఠశాలలో చేర్చాలంటే దూరాభారం ఉందని నడుచుకుంటూ వెళ్లలేని దుస్థితి ఉందని తెలిపారు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి పల్లె గడ్డ తండా ప్రాథమిక పాఠశాలకు నిధులు మంజూరు చేసి పాఠశాల భవనం నిర్మించాలని తాండా ప్రజలు కోరుతున్నారు. మరి ఇప్పటికైనా స్పందిస్తారో లేదో వేచి చూడాల్సిందే మరి.