మా సమస్యలు పరిష్కరించండి
చమురు ధరలకు అనుగుణంగా ఆటో మీటర్ చార్జీలు పెంచాలి
ఆటో డ్రైవర్ల డిమాండ్
ఆర్టీఏ ఆఫీసు ఎదుట ధర్నా
ఖైరతాబాద్, జూలై 28 (విజయక్రాంతి): ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రవాణ శాఖ కార్యాలయం ఎదుట భారీ ధర్నాను మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆటో, మోటార్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వెంకటేశం మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ హయాంలో ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే కోవలో ప్రయాణిస్తోందని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి తలచుకుంటే కేవలం ఒకేరోజులో తమ సమస్యలు పరిష్కారమవుతాయని ధీమా వ్యక్తం చేశారు.
13 సంవత్సరాల నుంచి పెండింగ్‌లో ఉన్న ఆటో మీటర్ చార్జీలను పెరిగిన చమురు ధరలకు అనుగుణంగా పెంచాలన్నారు. రవాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఆటో డ్రైవరుకు ఏడాదికి రూ.12వేలు ఆర్థిక సహాయం అందించాలని కోరారు. డ్రైవర్ల కోసం ప్రభుత్వమే ప్రత్యేక యాప్ రూపొందించి నిర్వహించాలన్నారు. జీఓ 263 ప్రకారం మిగిలిన ఆటో పర్మిట్లను తక్షణమే జారీ చేయాలన్నారు. ఓలా, రాపిడో, ఉబర్ సేవలను నిషేధించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే సీఎం రేవంత్‌రెడ్డి ఇంటిని వేలాది ఆటోలతో దిగ్భందిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.






