మంగపేటలో టోర్నడో?
29-07-2026 01:29 AM
భారీగా నేలకొరిగిన వృక్షాలు
ములుగు, జూలై 28 (విజయక్రాంతి): టోర్నడో తరహాలో ములుగు జిల్లా మంగపేటలో మంగళవారం సాయంత్రం ఆకస్మాత్తుగా వీచిన పెను గాలులకు వందలాది భారీ వృక్షాలు నేలకొరిగాయి. మంగపేట నుంచి కోమటిపల్లి వెళ్లే మార్గంలో సండ్రోని ఒర్రె సమీపంలోని అటవీ ప్రాంతంలో భారీ ఈదురుగాలులు, సుడిగాలితో మహావృక్షాలు రోడ్డుపై నేలకూలాయి.
2024 ఆగస్టు 31న ఇదే జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారం అటవీ ప్రాంతంలో వేల సంఖ్యలో వృక్షాలు కూలిన సంఘటన తరహాలోనే మంగపేటలో కూడా పెద్ద ఎత్తున చెట్లు నేలకొరగడంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. చెట్లు కూలిన సంఘటన తెలుసుకున్న మంగపేట పోలీసులు రోడ్డుపై కూలిన వృక్షాలను యంత్రాలతో తొలగించే చర్యలు చేపట్టారు.






