14 March, 2026 | 3:23 AM

పట్టణ కేంద్రంలో పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

14-03-2026 01:54 AM

పెబ్బేరు మార్చి 13: పట్టణ కేంద్రంలో నిర్వహించనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పట్టణంలో మొత్తం నాలుగు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయబడినట్లు అధికారులు తెలిపారు. అవి జిల్లా పరిషత్ ఉన్నత బాయ్స్ పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, మాస్టర్ మైండ్స్ స్కూల్, లిటిల్ స్కాలర్ స్కూల్ కేంద్రాలు.ఈ కేంద్రాలలో ఈ రోజు విద్యార్థుల రోల్ నంబర్లు కేటాయించడం జరిగింది.

పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు ఏర్పాటు చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. నాలుగు కేంద్రాల్లో మొత్తం 621 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందులో 380 మంది బాలికలు, 242 మంది బాలురు ఉన్నారు. పరీక్షల నిర్వహణ కోసం మొత్తం 35 మంది ఇన్విజిలేటర్లు, 4 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, అలాగే 4 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు విధుల్లో పాల్గొననున్నారు.

విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు అరగంట ముందుగానే చేరుకొని ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని అధికారులు కోరారు. పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించబడతాయి.పరీక్షలు జరుగుతున్న సమయంలో పరీక్షా కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లు తెరవరాదని అధికారులు స్పష్టం చేశారు. అలాగే ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.