5 June, 2026 | 9:10 PM

ప్రీ-ప్రైమరీ ఇన్స్ట్రక్టర్, ఆయాల పోస్టులకు దరఖాస్తులు

05-06-2026 07:39 PM

మేడిపల్లి,(విజయక్రాంతి): మేడిపల్లి మండల పరిధిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో మంజూరైన ప్రీ-ప్రైమరీ విభాగాల కోసం ఇన్స్ట్రక్టర్, ఆయాల పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రీ-ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ పోస్టుకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు శిశు విద్య లేదా ప్రైమరీ టీచింగ్లో అర్హత కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఆయా పోస్టుకు కనీస విద్యార్హతగా 7వ తరగతి ఉత్తీర్ణతను నిర్దేశించారు.

అభ్యర్థుల వయస్సు 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, మాజీ సైనికులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో పరిమితిలో సడలింపు వర్తిస్తుంది. దరఖాస్తుదారులు స్థానిక నివాసులై ఉండాలని స్పష్టం చేశారు.ఆసక్తి కలిగిన అభ్యర్థులు నిర్దేశిత దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేసి, అవసరమైన ధ్రువపత్రాల ప్రతులను జతచేసి, పీర్జాదిగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలోని మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో జూన్ 8, 2026 సాయంత్రం 5 గంటల లోపు సమర్పించాలని సూచించారు.ఈ అవకాశాన్ని అర్హులైన స్థానిక అభ్యర్థులు వినియోగించుకోవాలని అధికారులు కోరారు.