కేటీఆర్ ఒత్తిడితోనే మునగనూరులో ఆరోపణలు
ఆర్‌డీసీ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి ధ్వజం
ఇబ్రహీంపట్నం, జులై 9 (విజయక్రాంతి): ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే బిఆర్‌ఎస్ నేత కిషన్రెడ్డి తమపై అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి మండిపడ్డారు. గురువారం తొర్రూరు గ్రామంలో స్థానిక నేతలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరసగా తాము చేపడుతున్న అభివృద్ధి పనులను ఓర్వలేకే కిషన్రెడ్డి మునగనూరుకు వచ్చారని ఆయన ధ్వజమెత్తారు.
2023లో రిజిస్ట్రేషన్ జరిగితే అప్పుడు అధికారంలో ఉన్నదెవరు?మునగనూరు సర్వే నంబర్ 44లో భూములు కబ్జా చేశారంటున్న కిషన్రెడ్డి, ఆ భూమి రిజిస్ట్రేషన్ 2023లో జరిగినప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ఎవరని రాంరెడ్డి ప్రశ్నించారు. భూముల కబ్జా విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించడమే కాకుండా, ఆ భూముల్లో ప్రభుత్వ బోర్డులను సైతం ఏర్పాటు చేయించారని గుర్తు చేశారు.గత 14 ఏళ్లుగా కిషన్రెడ్డి లాంటి వారి నుంచి తాము భూములను కాపాడుతూ వస్తున్నాం. వీలైతే పేదలకు ఇళ్ల స్థలాలు అడుగుతాం కానీ, మేము కబ్జాలు చేయబోం. ఇకపై లేనిపోని ఆరోపణలు చేస్తే సహించేది లేదని ఆయన పేర్కొన్నారు.
తహసీల్ద్పా పెట్రోల్ దాడికి కిషన్ రెడ్డి కబ్జాలే కారణం..
ఫార్మాసిటీ భూముల పరిహారం, ఇబ్రహీంపట్నం బస్డిపో పక్కన కబ్జా, మునగనూరు, అబ్దుల్లాపూర్మెట్ ఇలా అనేక చోట్ల వారి భూదోపిడికి అంతేలేకుండా పోయిందని రాంరెడ్డి ఆరోపించారు. కిషన్రెడ్డి చేసిన కబ్జాలే అబ్దుల్లాపూర్మెట్లో తహసీల్ద్పా పెట్రోల్ దాడికి దారితీశాయన్నారు. పాలనను పక్కన బెట్టి వ్యసనాలపై దృష్టిపెట్టే వారితో చెప్పించుకునే స్థితిలో తాము లేరని ఎద్దేవా చేశారు.
నిధుల సాధనలో ఇబ్రహీంపట్నం ముందంజ...
గతంలో వైఎస్సార్ హయాంలో రాష్ట్రంలోనే నంబర్ వన్ నియోజకవర్గంగా మలక్పేట్ను తీర్చిదిద్దిన ఘనత మల్రెడ్డి రంగారెడ్డి దని ఆయన కొనియాడారు. ప్రస్తుతం రాష్ట్రంలోనే ఎక్కువ నిధులు పొందిన నియోజకవర్గాలలో ఇబ్రహీంపట్నం నాలుగో స్థానంలో ఉందన్నారు. కేటీఆర్ ఒత్తిడికి లొంగి కిషన్రెడ్డి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే ఇకపై తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రాంరెడ్డి హెచ్చరించారు.






