10 July, 2026 | 5:14 AM

డిసెంబర్ నాటికి ఎయిమ్స్ పనులు పూర్తి

10-07-2026 12:22 AM

ఇది అంతర్జాతీయ స్థాయి పరిశోధనా సంస్థ 

కేంద్ర మంత్రి జేపీ నడ్డా

యాదాద్రి భువనగిరి, జూలై 9 (విజయక్రాంతి): ఈ ఏడాది డిసెంబర్ నాటికి బీబీనగర్ ఎయిమ్స్ నిర్మాణం పూర్తి చేస్తామని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా వెల్లడించారు. గురువారం బీబీనగర్ ఎయిమ్స్‌ను సందర్శించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. జూన్ 2022లో మంజూరైన బీబీనగర్ ఎయిమ్స్, కేవలం నాలుగేళ్ల కాలంలోనే ఎంతో వృద్ధి సాధించి సేవలందిస్తోందని, దీని కోసం రూ.వెయ్యి కోట్లకు పైగా నిధులు మంజూరు చేయగా, ఇప్పటివరకు రూ.110 కోట్లు ఖర్చు చేశామన్నారు.

ప్రస్తుతం ఇక్కడ 132 మంది ఫ్యాకల్టీ, 133 మంది సీనియర్ వైద్యులు సేవలందిస్తున్నారన్నారు. ప్రతిరోజూ 1,800 మంది రోగులు వైద్య సేవలు పొందుతున్నట్లు వివరించారు. ఇప్పటివరకు 1,56,000 మంది రోగులకు వైద్య సలహాలు అందించారన్నారు. ఎయిమ్స్ ఒక అంతర్జాతీయ స్థాయి పరిశోధనా సంస్థ అన్నారు. ఇక్కడ పరిశోధనల కోసం ఇప్పటివరకు రూ.64 కోట్ల గ్రాంట్లు మంజూరయ్యాయని, ప్రస్తుతం 129 రీసెర్చ్ ప్రాజెక్టులపై పనులు జరుగుతుండగా, ఇక్కడి ఫ్యాకల్టీ ఇప్పటివరకు 156 పరిశోధనా పత్రాలను ప్రచురించారన్నారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్‌రావు, ఎంపీలు కె లక్ష్మణ్, డీకే అరుణ, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, కలెక్టర్ అనురాగ్ జయంతి, మాజీ ఎంపీ బూర నర్సయ్య పాల్గొన్నారు.