వేణుగోపాలస్వామి.. భూ ఆక్రమణను అడ్డుకోరేమి!
శెట్టిపాలెంలో కబ్జాకు గురవుతున్న ప్రభుత్వ భూమి
కబ్జాదారు ఓ రేషన్ డీలర్?
రెవెన్యూ అధికారుల తీరుపై వెల్లువెత్తున్న ఆరోపణలు
రహదారి పేరుతో గుట్ట స్వాహా
జాడేలేని మైనింగ్ అధికారులు
ఇప్పటికైనా ప్రభుత్వ భూమినీ కాపాడాలని ప్రజల వేడుకోలు
వేములపల్లి, మార్చి 18 : కొన్ని వందల సంవత్సరాల చరిత్ర గల శెట్టిపాలెం లోని శ్రీ శ్రీ వేణుగోపాల స్వామి గుట్ట, ప్రభుత్వ భూములు కబ్జాదారుల కోరలకు బలి అవుతుండడంతో ప్రజలు ఆవేదనకు గురవుతున్నారు. ఈ వేణుగోపాలస్వామి గుట్టకు మహోన్నతమైన చరిత్ర ఉన్నప్పటికీ అప్పటినుండి ఎన్నుకోబడుతున్న ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోకపోవ డంతో గుట్ట కబ్జాకు గురై భావితరాలకు ఆ చరిత్ర తెలియకుండానే పోతుందని ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం నార్కట్ పల్లి, అద్దంకి రహదారిని కలుపుతూ శెట్టిపాలెం నుండి అవంతిపురం వద్ద కోదాడ విజయవాడ రాహధారిని కలుపుతూ సుమారు 70 కోట్ల రూపాయలతో మిర్యాలగూడకు ఔటర్ బైపాస్ ను ప్రభుత్వo నిర్మిస్తుంది.
ఈ రహదారి నిర్మాణానికి రోడ్డు కాంట్రాక్టర్లు వేణుగోపాలస్వామి గుట్టను తవ్వి పెద్ద పెద్ద గుండ్లను మట్టిని వాడుతూ రోడ్డు నిర్మాణానికి ఎటువంటి అనుమతులు లేకుండా గుట్టను స్వాహా చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం. వేణుగోపాల స్వామి గుట్ట చుట్టూ ఉన్న ప్రభుత్వ భూమి మూడు సర్వే నెంబర్లలో 47 ఎకరాల భూమి ఉన్నది. 31 సర్వే నంబర్ లో 18 ఎకరాలు, 81 వ సర్వే నెంబర్లో 20 ఎకరాలు, 82 వ సర్వే నెంబర్లో 9 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. ఇప్పటికీ రికార్డులలో ఉన్న భూమి ప్రభుత్వపరంగా కబ్జా ఉందో లేదో అధికారులు సర్వే చేసి ప్రభుత్వ భూములను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
ఆలయ చరిత్ర ఘనం :
శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయం కాకతీయుల నాటి కళావైభవానికి నిదర్శనం. వేణుగోపాల స్వామి ఆలయం నుండి సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలోని సోమప్ప ఆలయం వరకు సొరంగం మార్గం నిర్మించారని గ్రామస్తుల ద్వారా తెలుస్తుంది. నాటి భక్తులు ఎడ్ల బండ్లను కట్టుకొని ఈ సొరంగా మార్గంగుండా సోమప్పకు చేరుకునే వారిని చరిత్రకారులు చెబుతున్నారు. ఇంత గొప్ప ఆలయం కబ్జాదారుల కన్నులలో పడి గుట్ట, భూములు కబ్జాకు గురవుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నేటి తరానికి ఈ ఆలయ చరిత్ర తెలవకపోవడం శోచనీయమని పలువురు అభిప్రాయపడున్నారు.
రెవెన్యూ అధికారులపై ఆరోపణలు :
వేణుగోపాలస్వామి గుట్టకు ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూమిని ఓ రేషన్ డీలర్ ఆక్రమణకు గురి చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నట్లు స్థానికుల నుండి ఆరోపణలు వినిపిస్తున్నాయి. సదరు రేషన్ డీలర్ రెవెన్యూ అధికారులకు అధిక మొత్తంలో ముడుపులు అందజేస్తున్నాడని ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. దీంతో ప్రజా సొమ్ము కబ్జా కోరల్లో నలిగిపోతున్నదని వార్తలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా మైనింగ్ అధికారులు కూడా ఇటువైపు పట్టించుకోవడంలేదనే విమర్శలు స్థానికంగా వినవా.
గుట్టను తవ్వేస్తున్న కాంట్రాక్టర్!:
వేములపల్లి మండల కేంద్రం నుండి శెట్టిపాలెం మీదుగా అవంతిపురం వరకు ప్రభుత్వం నాలుగు లైన్ల రోడ్లు మంజూరి చేయగా నిర్మాణ పనులను మొదలుపెట్టారు. ఈ రోడ్డు నిర్మాణ పనులకు కాంట్రాక్టర్ ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా వేణుగోపాల స్వామి గుట్టను తవ్వి మట్టిని రోడ్డుకు పోస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ మట్టి తవ్వడంతో పక్కన ఉన్న పొలం యజమానులు గుట్టను కబ్జా చేస్తున్నట్లు స్థానికుల ద్వారా తెలుస్తుంది. దీంతో ప్రభుత్వ భూమి పరులపాలు అవుతుందని గ్రామ ప్రజలు వాపోతున్నారు. అధికారులు స్పందించి ఇప్పటికైనా శతాబ్దాల చరిత్ర ఉన్న వేణుగోపాల స్వామి ఆలయ గుట్టను కాపాడాలని కోరుతున్నారు.
ప్రభుత్వ భూములను కాపాడాలి
శతాబ్దాల చరిత్ర ఉన్న వేణుగోపాలస్వామి గుట్టను తవ్వడం సరికాదు. దేవాలయ గుట్టను, గుట్ట పక్కన ఉన్న ప్రభుత్వ భూములను కాపాడుకోవడం మనందరి బాధ్యత. ప్రభుత్వ అనుమతులు లేకుండా గుట్టను తవ్వే వారిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని వేణుగోపాల స్వామి గుట్టని కాపాడాలి.
- పెదమాం భరత్, స్థానికుడు




