గమ్యంలేని ఆర్టీసీ
- ప్రభుత్వ పెద్దల అస్పష్ట ఆలోచనల ఫలితం
- కార్మిక సంఘం ఎన్నికలు, ప్రభుత్వంలో విలీనంపై ఆలస్యానికి అదే అసలు కారణం
హైదరాబాద్, జూన్ 11 (విజయక్రాంతి) : కార్మిక సంఘాల ఎన్నికలు జరపకుండా.. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయకుండా ఇంకెంతకాలం ఇలా త్రిశంకుస్వర్గమని ఆర్టీసీ కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ఆర్టీసీపై ఏర్పాటైన మంత్రుల కమిటీ ఒక విధంగా ఆలోచిస్తుంటే.. ముఖ్యమంత్రి స్థాయిలో మరో విధమైన ఆలోచన ఉన్నట్టు సంకేతాలు అందుతున్నాయని కార్మిక సంఘాల ప్రతినిధులు అంటున్నారు.
దీంతో ఆర్టీసీ భవిష్యత్తును నిర్ణయించేలా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయ డం లేదు. అందులో భాగంగానే సరైన నిర్ణయం తీసుకోవంలో తీవ్ర జాప్యం జరుగుతున్నట్టు కార్మికులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో రెంటికీ చెడ్డ రేవడిలా ఆర్టీసీ తయారయ్యిందని వారు ఆవేదన చెందుతున్నారు.
గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి.. కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా మారుద్దామనే ప్రణాళిక తుదిదశకు చేరుకుంది. కేవలం గెజిట్ నోటిఫికేషన్ జారీచేసి.. అపాయింటెడ్ డేను ప్రకటిస్తే సరిపోతుంది. అయితే ఈలోపు ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రి య కాస్తా నిలిచిపోయింది. అయితే కొత్త ప్రభుత్వం వచ్చి ఇప్పటికే రెండున్నర సంవత్సరాలు దాటింది. నిజానికి విలీనం ప్రక్రియను పూర్తి చేయాలంటే.. ప్రభుత్వ పెద్దలు అనుకుంటే.. వారం రోజులు సరిపోతుందని కార్మిక వర్గాలు అంటున్నాయి.
కానీ.. రెండున్నర సంవత్సరాలుగా కాలయాపన చేసి, సమ్మెకు వెళ్ళిన తరువాతనే.. మంత్రుల కమిటీ చర్చలకు ముందుకు వచ్చిందని వారు చెబుతున్నారు. అయితే మంత్రుల కమిటీ ముందు నుంచీ.. ముందుగా కార్మిక సంఘానికి ఎన్నికలు నిర్వహించి, ఆ తరువాత అధికారుల కమిటీలో గుర్తింపు కార్మిక సంఘం ప్రతినిధు లను చేర్చి.. నిర్దిష్ట గడువులోగా ప్రభుత్వంలో విలీనం ప్రక్రియను ముగించొచ్చని చెబుతున్నది. రవాణా శాఖా మంత్రి పొన్నం ప్రభా కర్‌కూడా పలు సందర్భాల్లో ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. అయితే గడిచిన ఒకటిన్నర నెలలుగా కార్మిక సంఘానికి ఎన్నికల ప్రక్రియ ముందుకు అడుగులు వేయడం లేదు.
ఇదే సందర్భంలో.. కార్మిక దినోత్సవం (మే 1 తారీఖు) నాడు సీఎంతో ఆర్టీసీ కార్మిక సంఘాల ప్రతినిధుల భేటీ సందర్భంగా అసలు.. మీకు విలీనం కావాలా.. ఎన్నికలు కావాలా.. అప్షన్ మీదే అంటూ సీఎ సూచించారు. దీని, కార్మిక సంఘాల ప్రతినిధులు విలీనమే ముఖ్యమని స్పష్టంగా చెప్పారు. అయితే.. ఇటు మంత్రుల కమిటీ చెబుతున్నదానికి, అటు సీఎం ఆప్షన్ ఇచ్చినదానికి మధ్యన భిన్నమైన ఆలోచనలు ఉన్నట్టుగా అర్థమవుతున్నదని కార్మిక సంఘాలు అంటున్నాయి.
ఎన్నికలు నిర్వహించిన తరువాత.. విలీనంపై నిర్దిష్ట సమయంతో ముందుకు వెళతామని మంత్రుల కమిటీ చెబుతుండగా.. సీఎం మాత్రం ఆప్షన్ తీసుకుని.. నిర్ణయం తీసుకోవడంలో ఒకింత తాత్సారం చేస్తున్నారనే అభిప్రాయం కార్మిక వర్గాల్లో వ్యక్తమవుతుండటం గమనార్హం.
అడుగులు ఎటువైపు..
ప్రభుత్వ పెద్దల భిన్నమైన ఆలోచనలు కార్మికుల్లో ఆందోళన కలిగి స్తున్నాయి. అయితే భిన్న ఆలోచనల కారణంగానా.. లేక అసలు కార్మికులను పక్కదారి పట్టిద్దామనే ఉద్దేశంతోనా.. ఏ ప్రక్రియకూడా ముందుకు సాగడంలేదని వారంటున్నారు. కార్మిక సంఘానికి ఎన్ని కలు.. నిర్వహించాలని నిర్ణయం తీసుకుంటే.. 20 రోజుల్లో పూర్తిచేయవచ్చు. కానీ ఒకటిన్నర నెలలు గా ఆ దిశగా ఒక్క అడుగుకూడా పడలేదు.
ఇదే సందర్భంలో కార్మిక సంఘాల ప్రతినిధుల నుంచి విలీనమే మా ఆప్షన్ అని తెలుసు కున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఎన్నికలా.. విలీనమా.. అనే అంశాలపై ప్రభుత్వ నిర్ణయం రాకపోవడంతో, గందరగోళం నెలకొందని కార్మికులు వాపోతున్నారు. ఇప్పటికే ఒకటిన్నర నెలల కాలం వృధాగా గడిచి పోయిందని.. ఇప్పటికైనా ప్రభు త్వం, ప్రభుత్వంలోని పెద్దలు ఏదో ఒక నిర్ణయం తీసుకుని వేగం గా ప్రక్రియను పూర్తిచేయాలని ఆర్టీసీ కార్మికులు కోరుతున్నారు.






