వేగం పెంచండి
- పర్యావరణ అనుమతులు త్వరగా పొందాలి
- అధికారులకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశం
- ఆర్థిక ఇబ్బందులున్నా అన్ని ప్రాజెక్టులను పూర్తిచేస్తాం
- ఉమ్మడి ఖమ్మం జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, తుమ్మల, వాకిటి శ్రీహరి
హైదరాబాద్, జూన్ 11: రాష్ట్ర ప్రభుత్వానికి నీటిపారుదల రంగం అత్యంత ప్రా ధాన్యమని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కట్టుబడి ఉందని నీటి పారుదల, పౌర సరఫ రాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై హైదరాబాద్‌లోని జలసౌధలో గురువారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, జిల్లా ఇంచార్జ్ మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భం గా ఉత్తమ్ మాట్లాడుతూ.. భూసేకరణ, పునరావాసం, పునర్నిర్మాణం (ఆర్‌అండ్‌ఆర్), అటవీ, పర్యావరణ అనుమతులు, కోర్టు కేసులకు సంబంధించిన అంశాలను అత్యంత ప్రాధాన్యతతో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలను వెంటనే జిల్లా కలెక్టర్లు, ఆర్డీవోలకు పంపించి నిర్ణీత గడువు లోగా పరిష్కరించాలని సూచించారు.
సీతారామ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతుల సాధనకు త్వరగా చర్య లు తీసుకోవాలని, సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. వివిధ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధిం చి సుప్రీంకోర్టుతో పాటు వివిధ న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలపై సమర్థవం తంగా వాదించేందుకు అదనపు అడ్వకేట్ జనరల్‌ను ఢిల్లీలో నియమించే అంశాన్ని పరిశీలించాలని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వం చేసిన అప్పుల కారణం గా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, అయినప్పటికీ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను నాగార్జునసాగర్ ఎడమ కాలువ ద్వారా పాలేరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు మళ్లించే అంశానికి ప్రాధాన్యమివ్వాలని ఆదేశించారు.
దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద గోదావరి జలాలను ఎత్తి పోసి నాగార్జునసాగర్ ఎడమ కాలువతో అనుసంధానం చేయడం ద్వారా ప్రస్తుత ఆయకట్టుతో పాటు చివరి భూములు, నీటి కొరత ఉన్న ప్రాం తాలకు సాగునీరు అందించడమే లక్ష్యమన్నారు.
భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి
సాగునీటి ప్రాజెక్టుల పనులకు అడ్డంకులు ఏర్పడకుండా భూ సేకరణ వేగవంతం చేయాలని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. నిర్వాసితులకు పరిహారం చెల్లింపులు, పరస్పర అంగీకార ఒప్పందా ల ప్రక్రియలో వేగం పెంచాలని పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో భూ సేకరణ పూర్తి కాగా, మరికొన్ని చోట్ల అటవీ అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు మంత్రికి వివరించారు. జూలై నెలాఖరు నాటికి అవసరమైన అన్ని అనుమతులు పొందాలని మంత్రి ఆదేశించారు.
మున్నేరు పాలేరు గ్రావిటీ కాలువ నిర్మాణానికి నాలుగు గ్రామాల్లో 317 ఎకరాల భూమి అవసరమని అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రెండు గ్రామాల్లో సర్వే పూర్తి కాగా, మిగతా రెండు గ్రామాల్లో కొనసాగుతుందని తెలిపారు. భూసేకరణకు సుమారు రూ.30 కోట్ల వ్యయం అవు తుందని వెల్లడించారు. మంత్రి స్పందిస్తూ ఈ అంశాన్ని రెవెన్యూ శాఖతో చర్చించి యుద్ధ ప్రాతిపదికన ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. భూసేకరణ సమస్యలను కారణంగా చూపుతూ కాంట్రాక్టర్లు పనులు ఆలస్యం చేయకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
బయ్యారం మెట్ట ప్రాంతాలకు సాగునీరు
ఇల్లందు నియోజకవర్గంలోని బయ్యారం మెట్ట ప్రాంత గిరిజన రైతులకు సీతారామ ఎత్తిపోతల పథకం ప్యాకేజీ నుంచి సాగునీరు అం దించే ప్రతిపాదనకు మంత్రి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు. ఈ ప్రతిపాదనను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రతిపాదించారు. నీటి మూలం, కనిష్ట ఎత్తిపోత, స్థానిక వాగుల నీటి వినియోగం, ఆర్థిక వ్యయం, లబ్ధి పొందే ఆయకట్టు వంటి అంశాలపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
పోలవరం బ్యాక్‌వాటర్ సమస్యను పరిష్కరిస్తాం
పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ కారణంగా భద్రాచలం డివిజన్ పరిధిలో ఏర్పడుతున్న ముంపు సమస్యలపై పలువురు ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని త్వరలోనే పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) దృష్టికి తీసుకెళ్లి పరిష్కార మార్గాలను అన్వేషిస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టుల పనులను పరిశీలించేందుకు పక్షం రోజుల్లో జిల్లాలో పర్యటిస్తానని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. భూసేకరణ, పునరావాసం, అటవీ, పర్యావరణ, న్యాయపరమైన సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించి రైతులకు వీలైనంత త్వరగా సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు.
పూర్తి సహకారం ఉంటుంది : డిప్యూటీ సీం భట్టి
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేయడానికి అవసరమైన నిధులను సకాలంలో విడుదల చేస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.






