12 June, 2026 | 2:42 AM

టైటిల్ వార్!

12-06-2026 01:38 AM
  1. టీఆర్‌ఎస్ పేరుపై ముదురుతున్న వివాదం
  2. కవిత పార్టీకి కేటాయించొద్దని ఈసీఐకి దరఖాస్తులు 
  3.   700 వరకు అభ్యంతరాలు
  4. ఇప్పటికే ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించిన బీఆర్‌ఎస్ పార్టీ
  5. తాజాగా తెలంగాణ రాష్ట్ర సామాజిక సేన

హైదరాబాద్, జూన్ 11 (విజయక్రాంతి) : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజకీయ పార్టీ చుట్టూ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) పేరు తో ఆమె స్థాపించిన పార్టీకి ఊహించని అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఈ పేరుపై ఇప్పటికే వందల సంఖ్యలో అభ్యంతరాలు వెల్లువెత్తడం గమనా ర్హం. టీఆర్‌ఎస్ పేరుపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం గతంలో సూచించింది.

ఈ మేరకు దినపత్రిల్లో కవిత ఇచ్చిన ప్రకటనలపై 700 అభ్యంతరాలు అందినట్లు తెలుస్తోంది. అయితే ఈ పేరును కేటాయించవద్దంటూ ఇప్పటికే బీఆర్‌ఎస్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. ‘టీఆర్‌ఎస్’ పేరు తెలంగాణ ప్రజల సెంటిమెంట్, భావోద్వేగంతో ముడిపడి ఉందని, ఆ టైటిల్ కేటాయించవద్దని ఎన్నికల సంఘాన్ని బీఆర్‌ఎస్ కోరింది. ఇప్పటికీ ప్రజలు బీఆర్‌ఎస్‌ను ‘టీఆర్‌ఎస్’గానే గుర్తిస్తారని, ఆ పేరును ఎవరికీ కేటాయించద్దని విజ్ఞప్తి చేసింది.

కాగా కవిత పార్టీ ప్రకటనకు ముందే మహారాష్ట్రలోని సోలాపూర్ కేంద్రంగా పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర సామాజిక సేన (టీఆర్‌ఎస్ ) కూడా ‘టీఆర్‌ఎస్’ అనే పేరును తమకు కేటాయిం చాల ని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. సోలాపూర్‌కు చెందిన దయానంద్ మహాదేవ్ మామ్‌డ్యాల్ ఈ మేరకు కవిత పార్టీ ప్రకటనకు ఒక రోజు ముందే ఈసీఐకి దరఖాస్తు చేసినట్లు తెలిసింది.  

పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ

రాష్ట్ర రాజకీయాల్లో టీఆర్‌ఎస్ టైటిల్ వివా దం ముదురుతుండటం తెలంగాణ రక్షణ సేన క్యాడర్‌లో ఉత్కంఠ నెలకొంది. రాజకీయాల్లో సొంత వేదిక ఏర్పాటు చేసుకోవాలని తీవ్రం గా శ్రమిస్తున్న కవితకు పార్టీ పేరు విషయంలో అడ్డంకులు తప్పడం లేదు. పార్టీ ఆవిర్భావ సమయంలో కవిత తన నోటితో మన పార్టీ పేరు ‘టీఆర్‌ఎస్’ అని ప్రకటించగా.. వేదికపై ఏర్పాటు చేసిన స్క్రీన్లపై మాత్రం తెలంగాణ రాష్ట్రసేన అని ప్రదర్శించారు.

కొన్ని రోజులకే తెలంగాణ రక్షణ సేనగా ప్రకటించారు. రోజుల వ్యవధిలోనే పార్టీ పేరు మారడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కవిత కొత్తపార్టీకి  ‘టీఆర్‌ఎస్’ టైటిల్ ఉంటుం దా, పోతుం దా? అని ఉత్కంఠగా మారింది.