విద్యా, వైద్యంతోనే దేశాభివృద్ధి
- ప్రధాన ఇంజన్లుగా ఉన్న ఆరు నగరాలకు ఎం-6 టాస్క్‌ఫోర్స్ అవసరం
- విద్యా విప్లవం, నైపుణ్యాభివృద్ధి.. ప్రపంచ స్థాయి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి అవసరం
- కులగణన.. తెలంగాణ అభివృద్ధి నమూనాను వివరించిన సీఎం
- ఫ్యూచర్‌సిటీ, మెట్రో, మూసీ, పాలమూరు సెమికండక్టర్ పరిశ్రమల ఏర్పాటుకు సహకరించాలి
- ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో యంగ్ ఇండియా స్కూల్
- నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, జూన్ 11 (విజయక్రాంతి): దేశాభివృద్ధికి విద్య, వైద్యమే బలమైన పునాది అని, ఈ రెండింటినీ నాణ్యతతో ప్రతిపౌరుడికీ అందిస్తేనే ‘వికసిత్ భారత్’ సాధించవచ్చని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. విద్యా విప్లవం, నైపుణ్యాభివృద్ధి, ప్రపంచ స్థాయి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి అవసరమన్నారు. దేశ ఆర్థికాభివృద్ధికి ప్రధాన ఇంజిన్లుగా ఉన్న ఆరు నగరాల అభివృద్ధి కో సం పీఎంఓ ఆధ్వర్యంలో ‘ఎం- టాస్క్ఫోర్స్ ’ ఏర్పాటు చేయాలని, వీటికోసం రూ.6 లక్షల కోట్ల ప్రత్యేక నిధిని కేటాయించాలన్నారు.
తెలంగాణలో ఫ్యూచర్‌సిటీ, మెట్రో విస్తరణ, మూసీ పునర్జీవం, పాలమూరు-రంగారెడ్డి.. సెమికండక్టర్ పరిశ్రమల ఏర్పాటుకు సహకరించాలని కేంద్రప్రభుత్వాన్ని కోరారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో.. యంగ్ ఇండి యా స్కూల్ నిర్మిస్తున్నామని, వీటిని ఎవరైనా చూడాలనుకుంటే చూపిస్తామని స్పష్టం చేశా రు. గురువారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన 11వ నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు.
కులగణన తర్వాత తెలంగాణ అభివృద్ధి నమూనాను నీతి ఆయోగ్‌లో వివరించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... దేశాభివృద్ధి అంటే ప్రజల అభివృద్ధేనని గుర్తు చేశారు. ప్రజలను ఆర్థిక శక్తులుగా, దేశ నిర్మాతలుగా తీర్చిదిద్దడంలో విద్య, ఆరోగ్యం కీలక పాత్ర పోషిస్తాయని సీఎం చెప్పారు. తెలంగా ణ ప్రభుత్వం 2024లో నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయని సీఎం తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా 3.55 కోట్ల మంది, 242 కులాలకు చెందిన ప్రజల వివరాలను సేకరించిన ఈ సర్వేలో పైసలు, భూమి కంటే విద్యే సామాజిక వెనుకబాటుతనాన్ని ప్రభావితం చేస్తున్న ముఖ్యమైన అం శంగా తేలిందని చెప్పారు. అందుకే ప్రతి పౌరుడికీ నాణ్యమైన విద్య అందించడం ద్వారా మాత్రమే వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించవచ్చని స్పష్టం చేశారు.
తెలంగాణలో విద్యా- నైపుణ్యాభివృద్ధి విప్లవం..
విద్యాశాఖను తన వద్దే ఉంచుకోవడానికి కారణం విద్యపై తనకు ఉన్న నమ్మకమేనని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. గడచిన 75 ఏండ్లలో మనమంతా ఉచిత విద్య అందించేందుకు ప్రయత్నం చేశామని, కానీ నాణ్యమైన విద్యను అందించడం మనకు ఒక సవాల్‌గా మారిందన్నారు. అందుకే ప్రభుత్వ పాఠశాల ల్లో విద్యార్థులు చేరేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టిందన్నారు.
తెలంగాణ పబ్లిక్ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం, డిజిటల్ తరగతులు, ఉచిత అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్, పాఠశాల బస్సులు, క్రీడా సౌకర్యాలు, నాణ్యమైన బోధన అందిస్తున్నామని తెలిపారు. నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒకే క్యాంపస్‌లో చదివే అవకాశం కల్పిస్తున్నామని వివరించారు. తమ ప్రభుత్వం నిర్మించే యంగ్ ఇండియా స్కూల్స్ కులాల మధ్య గోడలు కూల్చివేస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
సమాజంలో సమానత్వం పెంపొందించేందుకు ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండి యా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. అన్ని వర్గాల పిల్లలు కలిసి చదువుకోవడం, కలిసి జీవించడం ద్వారా కుల వివక్ష తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, ప్రతి అసెం బ్లీ నియోజకవర్గంలో యంగ్ ఇండియా స్కూ ల్ నిర్మిస్తున్నామని వెల్లడించారు. దేశంలో ఏ రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి అయినా, అధికారులైనా తమ రాష్ట్రంలోని యంగ్ ఇండి యా స్కూల్స్ చూడాలంటే తాము సంతోషంగా చూపిస్తామని చెప్పారు.
ఏఐ యుగంలో యువతకు కొత్త నైపుణ్యాలు అవసరం
కృత్రిమ మేధస్సు (ఏఐ) యుగంలో యువతకు కొత్త నైపుణ్యాలు అవసరమని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. తయారీ రంగం, సేవారంగాల్లో భారీ ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు రీజినల్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రైల్వే, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. యువతకు ప్రపంచ స్థాయి శిక్షణ అందించేందుకు యంగ్ ఇం డియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఆనంద్ మహీంద్రా, శ్రీనిరాజు వంటి కార్పొరేట్ దిగ్గజాలు ఈ యూనివర్సిటీ నిర్వహణలో భాగస్వాములుగా ఉన్నారని సీఎం వివరించారు.
రాష్ట్రంలోని అన్ని ఐటీఐలను ఆధునిక సాంకేతిక శిక్షణ కేంద్రాలుగా మార్చేందుకు టాటా గ్రూప్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని సీఎం తెలిపారు. ఈ ప్రాజెక్టులో టాటా సంస్థ రూ.2,100 కోట్ల పెట్టుబడి పెడుతుందన్నారు. తెలంగాణ రైజింగ్ విజన్‌లో భాగంగా 2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చెప్పారు.
హైదరాబాద్‌కు ఐఐఎం రావాలి
ఉన్నత విద్య, పరిశోధనలు, ఆవిష్కరణలు, స్టార్టప్‌ల అభివృద్ధికి తెలంగాణ కేంద్రంగా మారుతోందన్నారు. ఇప్పటికే ఐఐటీ, ఐఐఐటీ, నల్సార్, ఐఎస్‌బీ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు ఉన్నాయని, హైదరాబాద్‌కు ఐఐఎం కూడా రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలను తెలంగాణకు తీసుకురావడానికి కృషి చేస్తున్నామని, ఈ దిశగా యూనివర్సిటీ ఆఫ్ లండన్ హైదరాబాద్‌లో ఆప్‌ఫోర్ క్యాంపస్ ఏర్పాటు చేయడం తొలి విజయమని వివరించారు.
దేశ ఆర్థికాభివృద్ధికి ప్రధాన ఇంజిన్లుగా ఉన్న ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు నగరాల అభివృద్ధి కోసం ప్రధానమంత్రి కార్యాల యం ఆధ్వర్యంలో ‘ఎం- టాస్క్ఫోర్స్’ ఏర్పాటు చేయాలని సీఎం ప్రతిపాదించారు. ఈ నగరాల అభివృద్ధి కోసం రూ.6 లక్షల కోట్ల ప్రత్యేక నిధిని కేటాయించాలని సీఎం కోరారు. ఒక్కో నగరానికి రూ.1 లక్ష కోటి చొప్పున మౌలిక వసతుల అభివృద్ధికి అందించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరుతూ సీఎం పలు ప్రతిపాదనలు చేశారు. రీజినల్ రింగ్ రోడ్, హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ, మూసీ నది పునరుజ్జీవనం, భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధి, పాలమూరు-- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతులు, సెమికండక్టర్ పరిశ్రమల ఏర్పాటుకు మద్దతు, హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు వంటి అంశాల్లో సహకారం అందించాలని కోరారు. దేశ ప్రజల ఆరోగ్యం, విద్యపై ప్రత్యేక దృష్టి పెడితే ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా భారత్ అవతరిస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.






