05-02-2026 12:00:00 AM
శిథిలావస్థకు చేరుకున్న గరిడేపల్లి బస్టాండ్
రోడ్లపై ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
ప్రారంభించాలని వేడుకోలు
గరిడేపల్లి, ఫిబ్రవరి 4 : లక్షల రూపాయలు వెచ్చించి కట్టిన బస్టాండ్ నేడు నిరుపయోగంగా మారింది. నాడు ప్రయాణికులతో కలకలలాడుతూ రద్దీగా ఉండే బస్టాండ్ నేడు శిథిలావస్థకు చేరుకున్న పట్టించుకునే నాధుడే కరువయ్యారు. గరిడేపల్లి మండల కేంద్రంలో 20 ఏళ్ల క్రిందట శ్రమదానంతో బస్టాండు నిర్మించారు. కొన్నేళ్ల పాటు ఏ ఇబ్బంది లేకుండా సజావుగానే నిర్వహించారు.
అయితే ప్రస్తుతం అతిపెద్ద మండలంగా గుర్తింపు పొందిన గరిడేపల్లిలో బస్టాండ్ పరిస్థితి దారుణంగా ఉంది.మండల పరిధిలో 33 గ్రామ పంచాయతీలు ఉన్నప్పటికీ మండల కేంద్రంలో బస్టాండ్ వినియోగంలో లేకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కోదాడ, మిర్యాలగూడ హైదరాబాద్ వెళ్లే ప్రజలు మండల కేంద్రాన్ని ఎంచుకుంటారు.లగ్జరీ సూపర్ లగ్జరీ, డీలక్స్, సూపర్ డీలక్స్ మండల కేంద్రమైన గరిడేపల్లి మీదగా వెళ్తుంటాయి.
అయితే మండల కేంద్రమైన గరిడేపల్లి లో బస్టాండ్ వినియోగంలో లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మిర్యాలగూడెం వైపే వెళ్లే ప్రయాణికులు కల్మలచెరువు వెళ్లే ప్రధాన రహదారి దగ్గర కోదాడ సూర్యాపేట వైపు వెళ్లే బస్సులు పోలీస్ స్టేషన్ రద్దీగా ఉండే హోటల్ దగ్గర ప్రయాణికులను ఎక్కించుకోవడం వల్ల వెనుక వచ్చే వాహనాలు నడిరోడ్డుపై ఆగడంతో నిత్యం ట్రాఫిక్ సమస్యల తో వాహనాదారులు ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.
నిత్యం నడిరోడ్లపై ట్రాఫిక్ సమస్యలు ఏర్పడటంతో బస్సులు సౌకర్యం లేక ఆపకపోవడంతో వృద్ధులు, విద్యార్థులు గంటల తరబడి వాహనాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని పలువురు అభిప్రా యాన్ని వ్యక్తం చేస్తున్నారు. దినదినాభివృద్ధి చెందుతున్న మండల కేంద్రమైన గరిడేపల్లి నడిబొడ్డున ఉన్న బస్టాండ్ కు దిక్కే లేకుండా పోయింది.
బస్టాండ్ కు ఇరువైపులా మండల కేంద్రం వ్యాపించి ఉన్నప్పటికీ ప్రయాణికులకు ప్రజలకు అందుబాటులో ఉన్న బస్టాండ్ ని పట్టించుకునే వారే లేకుండా పోయారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు చొరవ చూపి పరిస్థితిని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి అవసరమైన నిధులను మంజూరు చేయించాలని వెంటనే బస్టాండ్ ప్రారంభించి ప్రయాణికుల కష్టాలు తీర్చాలని మండల ప్రజలు కోరుతున్నారు.
పునః ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం
అందరికీ అందుబాటులో ఉన్న గరిడేపల్లి బస్టాండ్‌ను పునః ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నo.ఇప్పటికే నాలుగు లక్షలు మంజూరు అయాయి.. ఈ నిధులతో ప్రస్తుతం తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టి బస్టాండ్లోకి బస్సులను వెళ్లే విధంగా చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తున్నాం.
కొణతం జాన్ రెడ్డి, ఆర్టీసీ నల్గొండ రీజినల్ మేనేజర్
మా వంతు సహకారం అందిస్తాం
గరిడేపల్లి బస్టాండ్ లోకి బస్సులు రాకపోవడం వల్ల ప్రయాణికులు రోడ్డుపైనే వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎండలకు వానలకు వారు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం. అందుకే దీన్ని ఉపయోగంలోకి తీసుకురావడానికి మా వంతు కృషి చేస్తాం. ఆర్టీసీ అధికారులు స్పందించి వెంటనే ప్రారంభించేలా చూస్తాం. బస్టాండ్ ప్రారంభించిన అనంతరం పారిశుద్ధ్యoపై తప్పక దృష్టి సారిస్తాం.
మేకపోతుల వెంకటమ్మ చంద్రయ్య గౌడ్, సర్పంచ్ గరిడేపల్లి