15 July, 2026 | 1:40 AM

విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించేలా విద్యార్థులను తీర్చిదిద్దాలి

15-07-2026 01:40 AM

కలెక్టర్ చాహత్ బాజ్పాయ్

హనుమకొండ, జూలై 14(విజయ క్రాంతి): విద్య, క్రీడలు రెండింటిలోనూ రాణించేలా విద్యార్థులు ఎదగాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు. మంగళవారం జవహర్లాల్ నెహ్రూ స్టేడియం (జేఎన్‌ఎస్)లో యువజన సేవలు మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ క్రీడా పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి విద్యార్థుల విద్యా ప్రమాణాలు, క్రీడా శిక్షణ, మౌలిక సదుపాయాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా నాలుగో, ఐదో తరగతి విద్యార్థులతో ఆంగ్ల, తెలుగు పాఠ్యాంశాలపై ప్రశ్నలు అడిగి వారి అభ్యాస స్థాయిని కలెక్టర్ పరిశీలించారు. జాతీయ జెండా విశిష్టత, అశోక ధర్మచక్రం ప్రాధాన్యతపై విద్యార్థులు తెలిపిన సమాధానాలను అభినందించారు. విద్యార్థులకు పాఠ్యాంశాల బోధనతో పాటు వారి సహజ ప్రతిభను గుర్తించి, ఆయా క్రీడల్లో ప్రత్యేక శిక్షణ అందించడం ద్వారా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే క్రీడాకారులుగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులు, కోచ్లకు సూచించారు.   

జిల్లా యువజన సేవలు, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్విమ్మింగ్ పూల్ ను కలెక్టర్ సందర్శించి నిర్వహణ తీరును సమీక్షించారు. స్విమ్మింగ్ పూల్, వాటర్ పైప్లైన్ వ్యవస్థ, జిమ్ సెంటర్, ఇతర మరమ్మత్తు అభివృద్ధి పనులను పరిశీలించారు. జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి ప్రశాంత్, జీడబ్ల్యూఎంసీ ఎస్‌ఈ రాజ్కుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మాధవి, రవికుమార్, డీఈ రాజ్కుమార్, యువజన సేవలు, క్రీడల శాఖ అధికారులు పాల్గొన్నారు.