18-02-2026 01:38:51 AM
సూపర్ న్యూజిలాండ్
వరల్డ్‌కప్ నుంచి ఆఫ్ఘనిస్థాన్ ఔట్
చెన్నై, ఫిబ్రవరి 17: టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ సూప ర్ 8కు దూసుకెళ్లింది. కీలక మ్యాచ్‌లో కెనడాపై అద్భుత విజయాన్ని అందుకుంది. చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కెనడా అంచనాలను తలకిందులు చేస్తూ బ్యాటింగ్‌లో దుమ్మురేపింది. 19 ఏళ్ల యువరాజ్ సమ్రా 58 బంతుల్లోనే సెంచరీతో చెలరేగిపోయాడు. కివీస్ బౌలర్లపై విధ్వంసకర ఇన్నింగ్స్ తో విరుచుకుపడ్డాడు. తద్వారా అసోసియేట్ దేశం నుంచి సెంచరీ చేసిన క్రికెటర్ గా రికార్డులకెక్కాడు.
కైల్ జేమీసన్ లాంటి అత్యుత్తమ బౌలర్లను ఉతికారేయడం ఆశ్చర్యపరిచింది. గతంలో ఏ అసోసియేట్ దేశానికి చెందిన ఆటగాడు కూడా టీ20ల్లో సెంచరీ సాధించలేదు. ఈ టోర్నీలో ఇదే తొలి శతకం. సాధారణంగా పెద్ద జట్ల ప్లేయర్స్ నుంచి సెంచరీలు వస్తాయనుకుంటుండగా.. 19ఏళ్ల కెనడా ప్లేయర్ యువరాజ్ శతకం బాదాడు. అతని విధ్వంసంతోనే కెనడా నిర్ణీత 20 ఓవరల్లో 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఆరంభంలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయింది.
ఓపెనర్లు టిమ్ సైఫర్ట్, ఫిన్ అలెన్ అద్భుత ఆరంభం ఇచ్చినప్పటికీ ఈ ఇద్దరూ వెంటవెంటనే అవుటయ్యారు. దాంతో న్యూజిలాండ్ 30 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. టిమ్ సైఫర్ట్ 10 బంతుల్లో 6, ఫిన్ అలెన్ 8 బంతుల్లో 21 పరుగులు చేశారు.ఓపెనర్లు ఇద్దరూ అవుటైన తర్వాత రచిన్ రవీంద్ర - గ్లెన్ ఫిలిప్స్ ఆదుకున్నారు. ఈ ఇద్దరు బ్యాటర్లు అటాకింగ్ బ్యాటింగ్‌తో కెనడా బౌలర్లకు చుక్కలు చూపించారు. ముఖ్యంగా గ్లెన్ ఫిలిప్స్ రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ ఆడుతూ బౌండరీల మోత మోగించాడు.
కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన గ్లెన్ ఫిలిప్స్ ఆ తర్వాత దూకుడు పెంచాడు. రచిన్ రవీంద్ర కూడా 35 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గ్లెన్ ఫిలిప్స్ 36 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 76, రచిన్ రవీంద్ర 39 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 59 పరుగులతో నాటౌట్గా నిలిచి మ్యాచ్ని గెలిపించారు. కివీస్ కేవలం 15.1 ఓవర్లలోనే టార్గెట్ ను అందుకుంది. ఈ విజయంతో న్యూజిలాండ్ సూపర్-8కి అర్హత సాధించగా, అప్ఘనిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.