18-02-2026 01:36:00 AM
వర్షంతో ఐర్లాండ్, జింబాబ్వే మ్యాచ్ రద్దు
సూపర్ జింబాబ్వే
గ్రూప్ స్టేజ్‌లోనే ఆసీస్ ఔట్
పల్లెకెలె, ఫిబ్రవరి 17: టీ20 ప్రపంచకప్ 2026లో ఆస్ట్రేలియా కథ ముగిసింది. మరో మ్యాచ్ మిగిలుండగానే ఆ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. వర్షం కారణంగా జింబాబ్వే, ఐర్లాండ్ మ్యాచ్ రద్దవడంతో ఇరు జట్లకు చెరొక పాయింట్ కేటాయించారు. దీంతో గ్రూప్ బి నుంచి శ్రీలంక ఇప్పటికే సూపర్ 8లోకి అడుగుపెట్టగా.. ఇప్పుడు 5 పాయింట్లతో జింబాబ్వే కూడా ముందంజ వేసింది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే ఓడిపోయి ఉంటే ఆస్ట్రేలియాకు సూపర్ 8 చేరే అవకాశాలుండేవి. అయితే వర్షంతో మ్యాచ్ రద్దవడంతో ఆసీస్‌కు ఆ అవకాశం కూడా లేకుండా పోయింది.
దీంతో గ్రూప్ స్టేజ్‌లోనే ఆస్ట్రేలియా ఇంటిదారి పట్టింది. 2009 తర్వాత గ్రూప్ స్టేజ్‌లోనే టోర్నీ నుంచి నిష్క్రమించడం కంగారూలకు ఇదే తొలిసారి. నిజానికి ఈ సారి ఆసీస్ జట్టు కీలక ఆటగాళ్ల సేవలు కోల్పోయింది. హ్యాజిల్ వుడ్, కమ్మిన్స్, స్టార్క్ వంటి పేసర్లు లేకుండానే మెగాటోర్నీ ఆడేందుకు వచ్చింది. గాయాల కారణంగా వారంతా వరల్డ్ కప్‌కు దూరమయ్యారు. దీంతో ఆసీస్ బౌలింగ్ బలహీనంగా మారిపోయింది. ఈ కారణంగానే జింబాబ్వే చేతిలో ఆసీస్ చిత్తుగా ఓడింది. ఆ జట్టుపై జింబాబ్వే మంచి స్కోరు సాధించి వారి అవకాశాలను దెబ్బకొట్టింది.
గ్రూప్ స్టేజ్‌లో కేవలం ఐర్లాండ్‌పై మాత్రమే గెలిచిన ఆస్ట్రేలియా తర్వాత జింబాబ్వే , శ్రీలంక చేతిలో పరాజయాలు చవిచూసింది. జింబాబ్వే చేతిలో ఓడిపోవడం ఒక విధంగా కంగారూలకు పెద్ద షాకే. కీలక బ్యాటర్లు ఎవ్వరూ కూడా రాణించడం లేదు. మాక్స్ వెల్ ఒక్క మ్యాచ్‌లోనూ పెద్ద ఇన్నింగ్స్ ఆడలేదు. మార్ష్ గాయంతో మధ్యలో లేకపోవడం కూడా ప్రభావం చూపింది. ఇప్పుడు ఆసీస్ చివరి మ్యాచ్‌లో ఒమన్‌తో తలపడుతుంది. ఆ మ్యాచ్‌లో గెలిచి మెగాటోర్నీ విజయంతో ముగించాలని భావిస్తోంది.
ఇదిలా ఉంటే ఆసీస్ జింబాబ్వే చేతిలో ఓడిపోయిన తర్వాత ఆ దేశ మాజీ ఆటగాళ్లు సెలక్టర్లపై మండిపడుతున్నారు. ఫామ్‌లో లేని ఆటగాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చి కొంపముంచారని విమర్శిస్తున్నారు. కాగా 2027 తొలి ఎడిషన్ లో సెమీఫైనల్స్ వరకూ చేరిన ఆసీస్ తర్వాత 2009లో గ్రూప్ స్టేజ్ లోనూ, 2010లో రన్నరప్‌గానూ నిలిచింది. 2012లో సెమీఫైనల్స్, 2014,2016 ఎడిషన్లలో సూపర్ 10 స్టేజ్‌కే పరిమితమైంది. అయితే 2021లో ఛాంపియన్‌గా నిలిచి తర్వాత గత రెండు ఎడిషన్లలోనూ సూపర్ 8 స్టేజ్‌లోనే ఇంటిదారి పట్టింది.