29 June, 2026 | 1:07 AM

కంటెంట్‌పై నమ్మకంతోనే భారీ బడ్జెట్ పెట్టాం

29-06-2026 12:01 AM

విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రంలో నభా నటేశ్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేశ్ మంజ్రేకర్, రిషబ్ సావ్నీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

జూలై 3న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి విలేకరులతో సినిమా విశేషాలు పంచుకున్నారు. మీడియా అడిగిన ప్రశ్నలకు వారు ఇచ్చిన సమాధానాలు వారి మాటల్లోనే.. “-మేము సాఫ్ట్‌వేర్ కంపెనీని విజయవంతంగా నిర్వహించాం. ఆ రంగాన్ని వదిలిపెట్టాలన్న ఉద్దేశంతో సినిమా పరిశ్రమను ఒక మంచి అవకాశంగా భావించాం. ‘నాగబంధం’ కంటే ముందు మరో కథ విన్నాం. అది చాలా పెద్ద హీరోతో చేయాల్సిన భారీ ప్రాజెక్ట్.

అయితే అప్పటికి మేము సినీ నిర్మాతలుగా నిరూపించుకోలేదు కాబట్టి ఆ అవకాశం రాలేదు. మరో విషయం ఏంటంటే మైథాలజికల్ కథతో సినిమా చేయాలనే ఆలోచన ఎంతో కాలంగా ఉంది. అలా మేము అభిషేక్‌ను కలిశాం. ఆయన విజన్ మాకు చాలా నచ్చింది. ‘నాగబంధం’ కథ అభివృద్ధి చెందుతున్న కొద్దీ మా నమ్మకం పెరిగింది. కంటెంట్‌పై వున్న నమ్మకంతో రూ.110 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మించాం. ఐఐటీ గ్రాడ్యుయేట్స్ అయినప్పటికీ తొలినాళ్లలో నాలుగేళ్లపాటు ఎలాంటి ఆదాయం లేకుండా కష్టపడ్డాం. మాపై మాకు ఉన్న నమ్మకం ఈ స్థాయికి తీసుకొచ్చింది. అదే నమ్మకంతో సినిమా రంగంలో కూడా రిస్క్ తీసుకున్నాం. పెట్టిన ప్రతి రూపాయీ తెరపై కనిపించాలనే ఉద్దేశంతో రాజీ పడకుండా నిర్మించాం. మేము ఊహించిన దానికంటే గొప్పగా సినిమా వచ్చింది.”