మంత్రి పదవి ప్లకార్డు ప్రదర్శన భయమేనా?
- కాంగ్రెస్ యువనేత జంగిలి నాగరాజును ముందస్తుగా అదుపులోకి తీసుకున్న పోలీసులు
మునుగోడు,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా పోలీసులు పలువురు రాజకీయ పార్టీల నాయకులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. మునుగోడు మండలంలో బీఆర్ఎస్, బీజేపీ నేతలతో పాటు అధికార కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యువనేత జంగిలి నాగరాజును కూడా ఆదివారం తెల్లవారుజామున ఆయన నివాసం వద్ద నుంచి అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన హామీ మేరకు మంత్రి పదవి ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి సభలో ప్లకార్డు ప్రదర్శన ద్వారా నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉందన్న సమాచారంతోనే జంగిలి నాగరాజును ముందస్తుగా నిర్బంధించినట్లు సమాచారం.ఈ ఘటన స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీకి చెందిన నాయకుడినే సభకు వెళ్లకుండా ముందస్తుగా అదుపులోకి తీసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. పోలీసులు మాత్రం భద్రతా చర్యల్లో భాగంగానే ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
మంత్రి పదవి... నిధుల వివక్షత పై అసంతృప్తి
భువనగిరి పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి విజయం సాధిస్తే మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చిన అది నెరవేరా లేదన్న అసంతృప్తి రాజగోపాల్ రెడ్డి లో ఇప్పటికీ కొనసాగుతుందని చర్చ ఉంది. మరోవైపు మునుగోడు నియోజకవర్గానికి నిధులు కేటాయించడంలో వివక్షత చూపుతున్నారని ఆయన పలుమార్లు బహిరంగంగానే విమర్శించారు.రోడ్లు ఇతర అభివృద్ధి పనులకు నిధులు అందక కాంట్రాక్టర్లు పనులు నిలిపివేసిన విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లిన పెద్దగా ఫలితం కనిపించలేదని అభిప్రాయం ఆయన వర్గాల్లో వినిపిస్తుంది.
సీఎం సభకు దూరంగా రాజగోపాల్ రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నల్గొండ వేదికగా జరిగిన కీలక ప్రభుత్వ కార్యక్రమాలన్నిటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ప్రభుత్వం తొలి ఏడాది సందర్భంగా నిర్వహించిన ప్రజా పాలన వేడుకలు, సన్న బియ్యం , రేషన్ కార్డుల పంపిణీ వంటి ప్రధాన కార్యక్రమాలకు మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేతృత్వం వహించారు.
అధికారిక ఆహ్వానాలు అందినప్పటికీ రాజగోపాల్ రెడ్డి మాత్రం ఈ కార్యక్రమాలకు దూరంగానే ఉన్నారు.డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ తొలి జన్మదిన వేడుకలను కూడా వెంకటరెడ్డి ఘనంగా నిర్వహించిన, ఆ కార్యక్రమానికి ఆయన దూరంగానే ఉన్నారు.






