18-02-2026 01:43:30 AM
నేడు భారత్ చివరి గ్రూప్ మ్యాచ్
నాలుగో విజయంపై భారత్ కన్ను
తుది జట్టులో మార్పులు
టైటిల్ ఫేవరెట్ రేసులో దూసుకెళుతూ సూపర్ 8 బెర్త్ ఖాయం చేసుకున్న టీమిండియా ఇప్పుడు చివరి గ్రూప్ మ్యాచ్ కు సిద్ధమైంది. అహ్మదాబాద్ వేదికగా నెదర్లాండ్స్‌తో తలపడబోతోంది. సూపర్ 8 స్టేజ్ కు ముందు మరో భారీ విజయంపై కన్నేసిన భారత్ గ్రూప్ స్టేజ్‌ను అజేయంగా ముగించాలని భావిస్తోంది.
అహ్మదాబాద్, ఫిబ్రవరి 17: టీ20 ప్రపంచకప్‌లో సూపర్ 8 స్టేజ్‌కు ముందు నెదర్లాండ్స్ పై బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసుకునేందుకు భారత్ రెడీ అయింది. గత మ్యాచ్‌లలో నిరాశపరిచిన అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ఫామ్‌లోకి వచ్చేందుకు ఇది గొప్ప అవకాశం. ముఖ్యంగా అభిషేక్ శర్మపైనే అందరి చూపు ఉంది. ఈ మెగాటోర్నీలో అభిషేక్ శర్మ చెప్పుకోదగిన ఇన్నింగ్స్ ఇప్పటి వరకూ ఆడలేకపోయాడు.
సూపర్ 8లో అన్నీ పెద్ద జట్లతోనే మ్యాచ్‌లు ఉన్న నేపథ్యంలో ఫామ్ అందుకోవడం అభిషేక్‌కు కూడా కీలకమనే చెప్పాలి. అలాగే సూపర్ ఫామ్‌లో ఉన్న మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ తన దూకుడు కొనసాగిస్తే తిరుగుండదు. ఇక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా పూర్తిస్థాయిలో టచ్‌లోకి రావాలని ఎదురుచూస్తున్నాడు. తిలక్ వర్మ దూకుడుగానే ఆడుతున్నా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నాడు. ఈ లోటును నెదర్లాండ్స్ తో మ్యాచ్ లో తీర్చేసుకుంటే సూపర్ 8 రౌండ్ కు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది.
అటు రింకూ సింగ్ కు పెద్దగా అవకాశాలు రాకపోగా, హార్థిక్ పాండ్యా పర్వాలేదనిపిస్తున్నాడు. ఒక్కోసారి బ్యాట్‌తో కాకుంటే బంతితో అదరగొడుతున్నాడు. చివర్లో శివమ్ దూబే కూడా మెరుపులు మెరిపిస్తుండగా.. మరో ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కూడా జట్టులో ఉండడంతో బ్యాటింగ్ డెప్త్ పెరిగింది. బౌలింగ్ విభాగంలో స్టార్ పేసర్ బుమ్రాకు విశ్రాంతినిచ్చే అవకాశాలున్నాయి. వర్క్ లోడ్ మేనే జ్ మెంట్‌లో భాగంగా అతనికి రెస్ట్ ఇచ్చి సిరాజ్ ను ఆడించే అవకాశముం ది.
అలాగే ధారాళంగా పరుగులిచ్చేస్తున్న అర్షదీప్ సింగ్ తన లైన్ అండ్ లెంగ్త్ అందుకుటాడేమో చూడాలి. స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి అదరగొడుతున్నారు. వీరి స్పిన్ మ్యాజిక్‌కు నెదర్లాండ్స్ బ్యాటర్లు క్రీజులో ఎంతవరకూ నిలబడతారో చూడాలి. ఒకవేళ వాషింగ్టన్ సుందర్‌కు అవకాశమివ్వాలనుకుంటే మాత్రం రింకూను తప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద నెదర్లాండ్స్‌ను కూడా చిత్తు చేసి నాలుగు విజయాలతో సూపర్ 8 స్టేజ్‌కు పూర్తి ఆత్మవిశ్వాసంతో వెళ్లాలని భారత్ భావిస్తోంది.
తుది జట్లు అంచనా:
భారత్: అభిషేక్ శర్మ,ఇషాన్ కిషన్,తిలక్ వర్మ,సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్థిక్ పాండ్యా,శివమ్ దూబే,అక్షర్ పటేల్,వాషింగ్టన్ సుందర్,అర్షదీప్‌సింగ్,మహ్మద్ సిరాజ్,వరుణ్ చక్రవర్తి
నెదర్లాండ్స్: మైకేల్ లెవిట్, మాక్స్ వొడౌడ్, లీడీ , కొలిన్ అకెర్‌మాన్, స్కాట్ ఎడ్వర్డ్స్, లించాకెట్, వాండర్ మెర్వ్, లోగ్న్ వాన్ బీక్, ఆర్యన్ దత్, పాల్ వాన్ మికీరన్, ఫ్రెడ్ క్లాసెన్
పిచ్ రిపోర్ట్:
మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న అహ్మదాబాద్ పిచ్ బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుంది. సగటున ఇక్కడ 180 ప్లస్ స్కోరు ఈజీగా నమోదవుతున్నాయి. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు ప్రభావం చూపొచ్చు.